తెలుగు సినీరంగంలో బయోపిక్ చిత్రాలు రాజకీయాలకు ఇబ్బంది కానున్నాయా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో బయోపిక్ చిత్రాల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయంగా కూడా బయోపిక్‌లు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ సినిమాలు ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి. యాత్ర వల్ల లాభం ఎవరికి..? ఎన్టీఆర్ బయోపిక్‌తో తెలుగుదేశం లబ్ధి పొందుతుందా..?

భారతదేశ సినీరంగంలో జీవిత చరిత్రలు ఎక్కువ అయినాయి. వాటిలో రాజకీయనాయకులకి, క్రీడాకారులకు మరియు సినీతారలకు, వ్యాపారవేత్తలకు, వివిధ రంగాలలోని వ్యక్తులకు సంబంధించిన విజయగాధాలను మన సినీ దర్శకులు ఆదర్శంగా తీసుకొని,వారికున్న సృజనాత్మక శక్తితో, ఉహాలను కలుపుతూ మేధాశక్తితో తగిన ఆలోచనలు చేసి వాటిని ఎంతో కృషి నిబద్దతతో అంకితభావంతో రూపొందిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో మాత్రం మూడు బయోపిక్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అందులో ఒకటి తెలుగు ప్రజల ఆరాధ్య ధైవం నందమారి తారకరామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ కాగా.. రెండవది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద తీస్తున్న చిత్రం యాత్ర. ఇక మూడవ సినిమా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్‌టీఆర్.

అయితే బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తెలుగుదేశంకు ప్లస్ కానుందని భావిస్తుండగా.. యాత్ర వైసీపీకి ప్లస్ కానుందని అనుకుంటున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశంను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కాగా ‘ఎన్టీఆర్‌’ సినిమా గురించి తెలుగుదేశం ఘనంగా చెప్పుకొంటుండగా… ‘యాత్ర’ సినిమాపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే యాత్ర సినిమాతో వైసీపీకి ఒరిగేదేమీ లేదు. పైగా… ఇది కాంగ్రెస్‌ కోణంలో వస్తున్న చిత్రం అని చెప్పేవాళ్లు కూడా లేకపోలేదు.

అయితే ఇప్పటికే విడుదలైన యాత్ర టీజర్ ట్రైలర్ చూస్తుంటే.. కడప దాటి ప్రతి గడపకు వెళ్లాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో, మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ అంటూ వైఎస్ పాత్రదారి మమ్ముట్టి చెప్పే డైలాగులను బట్టి చూస్తుంటే.. సినిమాలో కాంగ్రెస్ పార్టీ గురించి లేకుండా కేవలం రాజశేఖర్ రెడ్డి ప్రాముఖ్యత మీద మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తే వైఎస్‌ పాత్రధారి మమ్ముట్టి కాంగ్రెస్‌ మార్కు కండువాను భుజంపై వేసుకుని కనిపించినా కాంగ్రెస్ జెండాలను వాడకుండా జెండాలపై పిడికిలి గుర్తు ఉండడం చేస్తుంటే కాంగ్రెస్‌కు అసలు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది.

అయితే యాత్ర సినిమాతో కాంగ్రెస్ కూడా వైఎస్ తమవాడే అని చెప్పుకోనుంది. వైఎస్‌ అంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే వైఎస్‌! కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు, కాంగ్రెస్‌ సిద్ధాంతాలను వివరిస్తూ, కాంగ్రెస్‌ మనిషిగా ఆయన పాదయాత్ర చేశారు. కాంగ్రెస్‌ ప్రస్తావన లేకుండా, తేకుండా చేస్తే ‘యాత్ర’ అనే సినిమాలో జీవం లేనట్లేనని వారు చెప్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. నవ్యాంధ్రలో బాగా నీరసించిన కాంగ్రెస్‌ పార్టీకే ‘యాత్ర’ మేలు చేస్తుందని చెప్పేందుకు మరి కొన్ని కారణాలు కూడా చూపుతున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు అంటే.. ప్రధానంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు. కేవలం వైఎస్‌పై ఉన్న అభిమానమే దీనికి కారణం. వారంతా తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తారని వాళ్లు భావిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే బాలకృష్ణనే స్వయంగా సినిమాను తీస్తుండడంతో.. ప్రస్తుతం తెలుగుదేశంలోనే బాలకృష్ణ ఉండడంతో సినిమాని తెలుగుదేశంకి ఉపయోగపడే కోణంలోనే తీసే అవకాశం ఉంది. అయితే వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం తెలుగుదేశంకు పూర్తి వ్యతిరేఖంగా ఉండే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం పూర్తిగా ఉంటుందని చెప్పలేం కానీ కొంతమేర ఉండే అవకాశం మాత్రం ఉంది.

Share.

Leave A Reply

%d bloggers like this: