అలీ అసలు జగన్‌ను ఎందుకు కలిశారు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్న బండ్ల గణేష్, నిన్న అలీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినిమాలలో తోడుగా ఉన్న అందరూ రాజకీయాలలో మాత్రం దూరం అవుతున్నారా? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న అలీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలవడం ఇప్పడు చర్చనీయాంశం అయింది. అలీ వైసీపీలో చేరుతున్నాడా? అలీ అసలు జగన్‌ను ఎందుకు కలిశారు..?

హాస్యనటుడు అలీ కేవలం నటుడిగానే కాకుండా.. మొదట నుంచి కొంత పొలిటికల్ ఇంట్రస్ట్ ఉన్న వ్యక్తిగా ఉన్నారు. అలీ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి పలుమార్లు సీటు ఆశించారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో పవన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో అలీ తొలి వరుసలోనే ఉంటాడు. ఈ కారణంగానే పవన్ నటించే ప్రతి సినిమాలో అలీ తప్పనిసరిగా కనిపిస్తుంటాడు. పవన్ సినిమాల్లో అలీకి కీలక పాత్ర ఖచ్చితంగా దక్కేది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే… తప్పనిసరిగా తన స్నేహితుడు పవన్ స్థాపించిన పార్టీలోనే అలీ చేరతాడన్న విశ్లేషణలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను సినీనటుడు ఆలీ కలిశారు. జగన్‌తో సుమారు గంటసేపు అలీ వ్యక్తిగతంగా మాట్లాడారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆలీ ప్రశంసలు కురిపించారు. నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని ఆలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ గురించి కూడా ఇరువురు చర్చించుకున్నారు. దీంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. దీంతో జనసేనకు అలీ మద్దతు లేదనే అభిప్రాయం ఏర్పడుతుంది.

ఇదిలా ఉంటే అలీ అసలు ఎందుకు జగన్‌ని కలిసారో..? ఏం మాట్లాడుకున్నారో, ఏం నిర్ణయాలు తీసుకున్నారో, క్యాజవల్ మీటింగో అని చూసుకోకుండా.. ప్రకటన ఏమీ రాకుండా అలీని విమర్శిస్తూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అలీకి వ్యతిరేఖంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అది కూడా విమర్శ లెవిల్లో కాకుండా బూతులతో దిగజారటం పట్ల రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమావేశం అయిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అలీ మైనారిటీల సమస్యలు చర్చించటానికి వచ్చానని, రాజకీయ ప్రాధాన్యత లేదంటూ చెప్పారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈ సమావేశం వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా వైకాపా తరపున ఆలీ పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ వైసీపీలో అలీ చేరితే పవన్ వ్యతిరేఖ ప్రచార అస్త్రాలు జగన్‌కు అలీ ఇస్తారనే వాదన కూడా వినిపిస్తుంది.

అలీ తొలి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ టీడీపీతో సన్నిహితంగా మెలిగేవారు. టిడిపి అధినాయకత్వం 2010 మహానాడు నిర్వహణ కమిటీలో కూడా ఆయనకు చోటు కల్పించారు. ఆ మహానాడు సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలో ఆయనను వేశారు. ఆలీ గతంలో ఒకసారి టిడిపి తరపున ప్రచారం కూడా చేశారు. ఇకపోతే వైఎస్ జగన్ కు సినీ రంగం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం సినీనటుడు భానుచందర్, కృష్ణుడులు వైఎస్ జగన్ ను పాదయాత్రలో కలిశారు. ఇరువురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో సైతం కృష్ణుడు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: