కేసీఆర్ మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయుత చండీయాగం నిర్వహించి గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్.. దేశవ్యాప్తంగా చర్చ నియాంశం అయ్యారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేధపండితులతో 12రోజుల పాటు చండీయాగాన్ని నిర్వహించారు. ప్రముఖులందరు ఈ చండీయాగానికి హాజరయ్యారు. రాజులకాలం నాటి యాగ శాలల నిర్మాణం చేసి, వేలమంది పండితులతో వేదమంత్రాల ఉచ్చరణతో యాగం చేసిన ఆయన మరో యాగానికి సిద్దమయ్యారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజాసంక్షేమం, ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు మహా యాగానికి ఆయన సిద్ధమయ్యారు. లోకకల్యాణం, రాష్ట్ర అభివృద్ధి కోసం ‘మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం’ను ఆయన నిర్వహించబోతున్నారు. ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్ లో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు యాగాన్ని నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన ఆయుత చండీ మహా యాగం తరహాలోనే… ఈసారి కూడా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు.

చతుర్వేద పండితుడు, జ్యోతిరాప్తోర్యామ యాజి మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాక్రతువులో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. యాగ నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్‌ శుక్రవారంనాడు.. మాణిక్య సోమయాజితో చర్చలు జరిపినట్టు సమాచారం. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలిరోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణలవుతాయి. ఐదో రోజు 11 యజ్ఞకుండాల వద్ద.. ఒక్కో యజ్ఞకుండం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. మహారుద్ర యాగంలో భాగంగా నాలుగు రోజులూ కలిపి వెయ్యి పైచిలుకు రుద్రపారాయణలు, చివరిరోజున రుద్ర హవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ప్రతిరోజూ సాయంత్రంపూట తత్సంబంధిత జపాలు, భాగవత, రామాయణ పారాయణ చేస్తారు. యాగనిర్వహణకు సంబంధించి శృంగేరీ జగద్గురు భారతీ తీర్థ స్వామి ఆశీస్సుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వపత్రిక ఎడిటర్‌ అష్టకాల రామ్మోహన్‌ బృందం శృంగేరీకి వెళ్లనున్నట్టు తెలిసింది. కాగా.. ఈ యాగానికి వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలను, పీఠాధిపతులను, ధర్మాచార్యులను, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలను, వేదపండితులను, ప్రముఖులను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. కేసీఆర్ చేసే యాగం పై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది… గతంలో కేసీఆర్ చేసిన యాగంపై రాజకీయంగా అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పాలన పక్కనబెట్టి యాగాల పేరుతో కేసీఆర్ రాజుల పాలనను తిరిగి తీసుకొస్తున్నానే విమర్శలు వచ్చాయి. కానీ ఇవేవీ కేసీఆర్ పట్టించుకోకుండా తాను అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తిచేసారు. kcr

Share.

Comments are closed.

%d bloggers like this: