కొత్త ఏడాదిని ఎన్నికల ఏడాది అంటున్న రాజకీయ విశ్లేషకులు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న పార్టీలు
ఢిల్లీ పెత్తనంపై తిరుగుబాటు వ్యూహాలతో తెలుగుదేశం
పాదయాత్రతో ప్రజలకు చేరువైన జగన్
అవినీతి అస్త్రాలతో జనంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్

నూతన సంవత్సరం వచ్చేసింది. ఎన్నికల సమరం మొదలైంది. 2019 సంవత్సరంలో ఇండియాలోని పలు రాష్ట్రాలతో పాటు, వచ్చే ఐదేళ్లూ దేశ పరిపాలన ఎవరి చేతుల్లో ఉంటుందో తేల్చే లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరు కీలకం కాబోతున్నారు.? 3 రాష్ట్రాల్లో బీజేపీని పడగొట్టి కొమ్ములు విసురుతున్న రాహులా..? మూడో ఫ్రంటు నేతదా? మళ్లీ మోదీనే వస్తారా?

కొత్త ఏడాదిని ఎన్నికల ఏడాది అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఈ ఏడాదికి ప్రాధాన్యత చాలా ఎక్కువ.. ఈ సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్ము అండ్ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఐదు రాష్ట్రాలకు, లోక్ సభకు ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్న ఎన్నికల కమిషన్, ఫిబ్రవరి, మార్చి నెలలలో షెడ్యూల్‌ను ప్రకటించాలని భావిస్తున్నాయి. ఆపై అక్టోబర్ లో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు, నవంబర్ లో జార్ఖండ్ ఎన్నికలు జరగుతాయి. ఈ మూడు రాష్ట్రాలకూ ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్ర స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలై.. పంచాయతీ ఎన్నికల వరకూ ఈ ఏడాది పొడవునా ఎన్నికల కోలాహలమే సాగనుంది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను నిర్దేశించే అసెంబ్లీ ఎన్నికల సమరం ఈ ఏడాది ఎప్రిల్ లేదా మేలో జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అభివృద్ది నినాదంతో ఎన్నికలకు పోతుండగా… టీడీపీపై వ్యతిరేఖతను క్యాష్ చేసుకుంటూ గెలుపు బావుటా ఎగురవేయాలని ప్రతిపక్ష నేత జగన్ భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది మరో ముఖ్యమైన పార్టీ జనసేన కూడా ఎన్నికల బరిలో నిలిచింది. అవినీతి వ్యతిరేఖ పోరాటం.. మార్పు నినాదంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్దం అవుతున్నారు.

కొత్త ఏడాదిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు బాగా ముందుగానే సన్నద్ధమవుతున్నాయి. గత విధానానికి భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జనవరిలోనే తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత వీటి తొలి జాబితాలు విడుదల కావచ్చని ఆ పార్టీల నుంచి సంకేతాలు వస్తుతున్నాయి. ఫిబ్రవరి చివరన లేదంటే మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేనాటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ఇవి ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం ఈ పార్టీలు అంతర్గతంగా విస్తృత సమాచార సేకరణ, విశ్లేషణలు చేసుకుంటున్నాయి. ఖాయంగా గెలవగలరని అనుకుంటున్న వారో లేదా అంతకుమించి ప్రత్యామ్నాయం లేని వారినో తొలి జాబితాలో పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి.. ఢిల్లీ పెత్తనంపై తిరుగుబాటు వ్యూహాలతో తెలుగుదేశం ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యం అని చెప్తున్న ఆ పార్టీ అదినేత చంద్రబాబు.. కేంద్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడం, కొత్త పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డుల మంజూరు చేయడం వంటి వాటిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వివిధ జిల్లాల్లో ప్రజల మనోగతాలపై ప్రభావం చూపగల ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శరవేగంగా ప్రభుత్వం చేపడుతోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి, రాజధానిలో సచివాలయానికి భూమిపూజ, ప్రకాశం జిల్లాలో పేపర్‌ పరిశ్రమ, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన, కాకినాడలో భారీ పెట్రో కెమికల్‌ పరిశ్రమకు అవగాహనా ఒప్పందం, పోలవరం ప్రాజెక్టులో రేడియల్‌ గేట్ల బిగింపు పనుల ప్రారంభం, కర్నూలు ఓర్వకల్లులో విమానాశ్రయం ప్రారంభం వంటివి ఇందులో ఉన్నాయి. తమ ప్రభుత్వం మరోసారి వస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న కోణంలో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై రాష్ట్రం నలుచెరగులా పెద్దఎత్తున ప్రచారం చేస్తూ అన్ని జిల్లాల్లో ధర్మ పోరాట సభలు నిర్వహిస్తోంది తెలుగుదేశం. ఈ సంధర్భంగా చంద్రబాబుకు ఓటేస్తే ఢిల్లీ మీద గెలిస్తాం!
జగన్‌కు ఓటేస్తే కేసీఆర్.. మోదీ చేతుల్లో ఓడిపోతాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఆంధ్రకు అన్యాయం చేస్తుందని అటువంటి పార్టీతపో జగన్ కుమ్మక్కయ్యారంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం.

ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారు. చంద్రబాబుకు ప్రత్యామ్నయం తనే అనే విషయాన్ని ఇప్పటికే జనంలోకి తీసుకుని వెళ్లారు. దాదాపు ఎడాది నుండి జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రభుత్వంపై పోరాటంతో ప్రజలకు చేరువయ్యారు. అయితే జనవరి 9న పాదయాత్ర ముగించేసి తర్వాత మళ్లీ కూడా పార్టీలో సీట్లు వ్యవహారం చూసుకుని మరో దఫా రాష్ట్ర పర్యటనకు సిద్దం అయ్యారు. టీడీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, పాలన కుప్పకూలిపోయిందన్న ప్రచారం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. టీడీపీ కంటే తాము మరింత మెరుగ్గా సంక్షేమం కల్పిస్తామంటూ నవరత్నాల పేరుతో వివిధ హామీలను వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేఖతను క్యాష్ చేసుకునేందుకు చాలా గట్టిగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక 2014ఎన్నకల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైసీపీలు మాత్రమే పోటీ పడగా.. 2019లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో త్రిముఖ పోటీకి అవకాశం ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నికలలో దిగనుంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా కొత్త ఏడాదిలో రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటనలకు సన్నద్ధమవుతున్నారు. తెలుగుదేశం, వైసీపీలను అవినీతీ పార్టీలుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే జనసేన చూపగలిగే ప్రభావం ఎంత అన్నదానిపై విభిన్న అంచనాలు ఉన్నప్పటికీ కోస్తా ప్రాంతంలో టీడీపీ, వైసీపీ నేతల్లో గుబులు రేపడం మాత్రం ఖాయం అంటున్నారు. ప్రభుత్వంని ఎర్పాటు ఏర్పాటు చేసేంత బలం లేకున్నా కూడా కింగ్ మేకర్ పవన్ అవుతాడు అని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మూడు పార్టీలంత ప్రభావం చూపలేకపోయినా తమ శక్తి ఉన్నచోట్ల బల ప్రదర్శనకు కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఎంఐఎం కూడా ఈసారి ఏపీలో అడుగుపెట్టాలని చూస్తోంది. ఇప్పటికే గుంటూరు.. విజయవాడలో కొంతమంది నాయకులతో ఎంఐఎం దీనిపై చర్చించినట్లు తెలుస్తుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తో నేరుగా సంబంధం లేకపోయినా ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడ ఎంతమేరకు ప్రభావం చూపుతారో కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. గత ఎన్నికల్లో ఆంధ్రలో సానుకూల స్పందన పొందిన మోదీ.. ఈసారి ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బలంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఏ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి ప్రయాణించే సాహసం చేయదు. బీజేపీలో ఉన్న సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులు కూడా పక్క పార్టీల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. మోదీపై ప్రత్యక్ష సమరం చేస్తున్న టీడీపీ.. తన ప్రత్యర్థులైన జగన్‌, కేసీఆర్‌లను మోదీ టీంగా విస్తృత ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత పొందిన రాహుల్‌ ఈ ఎన్నికల సమయానికి తన గ్రాఫ్‌ పెంచుకోగలిగారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, రైతు రుణాలు రూ.2 లక్షల వరకూ మాఫీ చేస్తామని ప్రకటించడం ద్వారా కొంత సానుకూలత తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.

అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్‌.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతాం అంటూ.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రలో ఆయన ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పవన్, జగన్‌ల ఆస్తులు హైదరాబాద్‌లో ఉండడం వల్ల కేసిఆర్‌కు వారు సానుకూలంగా ఉంటున్నారని, వాళ్లను గెలిపిస్తే కేసిఆర్‌ను కూడా గెలిపించినట్లే అని ఇప్పుడు టీడీపీ అంటుంది. అయితే కేసిఆర్‌ ఎవరికి మద్దతు ఇచ్చినా కూడా వారికి మాత్రం ఆంధ్రలో ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఉద్యమ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల గతంలో ఆయనపై రాష్ట్ర ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉండేది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును విలన్‌గా ప్రచారం చేసి ఆయన కొంత ప్రయోజనం పొందగలిగారు. ఆయన ఆంధ్ర రాజకీయాలపై ఏ కొంత ఆసక్తి చూపించినా అదే బాణంను చంద్రబాబు ప్రయోగించే అవకాశం ఉంది.

ఇక ఎన్నికల వేళ సమీకరణాలు ఆధారంగా ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో ఎవరికీ అర్థం కావట్లేదు. జనసేన.. టీడీపీ, వైసీపీల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా.. లేక స్వతంత్రంగానే పోటీ చేస్తుందా అనేది ఇంకా అర్థం కాట్లేదు. రాష్ట్రంలో పొత్తులను మోదీ, కేసిఆర్‌లు ప్రభావితం చేయగలరని గతంలో ప్రచారం జరిగింది. కానీ జనసేన, వైసీపీ అధినేతలు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకోవడం చూస్తుంటే.. ఈ పొత్తు పొడిసే అవకాశం కానరాట్లేదు. ఇక జాతీయ స్థాయిలో, తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ మధ్య చిగురించిన స్నేహం ఆంధ్రలో పొత్తుకు దారి తీస్తుందా.. లేక ఎవరికి వారు విడిగానే పోటీ చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి. వామపక్షాలు ప్రస్తుతం జనసేనతో సన్నిహితంగా ఉన్నాయి. జనసేన ఒంటరిగా పోటీచేస్తే వామపక్షాలు ఆ పార్టీతోనే ఉంటాయి. బీజేపీ ప్రస్తుతానికి ఒంటరి పోరే చేస్తుంది. ఆ పార్టీతో పొత్తు అంటే మాత్రం ఆంధ్రలో ఆ పార్టీ గొయ్యి తొవ్వుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. చూడాలి మరి ఎన్నికల ఏడాది ఎంత రసవత్తరంగా ఉంటుందో..?

Share.

Comments are closed.

%d bloggers like this: