తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Google+ Pinterest LinkedIn Tumblr +

పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు ఇబ్బందులు తప్పవంటున్న టీచర్లు కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్లపై రగడ

ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కోర్టు మెట్లెక్కి.. దిగి.. చివరకు పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పేరుకు రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే, అయితే రాజకీయాల్లేని ఎన్నికలు ఉంటాయా..? అది అసాధ్యమే.. అయితే ఎన్నికలు ఇప్పటికే లేట్ అయినా కూడా ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేయడం.. ఇరవై రోజుల్లో ఎన్నికలు పెట్టడం పట్ల విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటి? విమర్శలకు కారణాలు ఎంటి?

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. జనవరి 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ నాగిరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం చీఫ్ తొందరపడుతున్నాడా? అనే అభిప్రాయం కొందరిలో కలుగుతుంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ బాటలోనే నడవాలని ఫిక్సయ్యాడా? అని అంటున్నారు. ఓ వైపు బీసీల రిజర్వేషన్‌లు.. మరోవైపు లక్షల ఓట్లు గల్లంతుతో అసెంబ్లీ ఎన్నికల్లో అస్తవ్యస్తంగా ఎన్నికల నిర్వహణతో ఎన్నికల సంఘం పనితీరుపైనే ఓ బ్యాడ్ మార్కు పడింది. అయితే ఇప్పుడు అదే ఓటర్ల జాబితాతో పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. అన్నీ చక్కదిక్కాక ఎన్నికలకు వెళ్తే సరిపోయేది కదా? ఇప్పటికిప్పుడు వెళ్తే ఎంత నష్టం అనేది కొందరి అభిప్రాయం.

అసలు సర్పంచులకు, పంచాయతీ సభ్యులకు ఉన్న పవర్లు ఏమున్నాయని..? నిజానికి రాష్ట్రానికి కూడా ఓ ఎన్నికల సంఘం ఉంటుందని, దీనికీ కేంద్ర ఎన్నికల సంఘానికీ సంబంధం లేదనీ, స్థానిక ఎన్నికలు వంటివే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని చాలామందికి తెలియదు. అందులోనూ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు.. పైగా అందరూ గ్రామీణ వోటర్లు.. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలి…? పేరుకు రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు, కానీ రాజకీయాల్లేకుండా ఎన్నికలు ఉంటాయా..? 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు మూడు విడతలుగా ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఉద్యోగుల్లో, టీచర్లలో ఈ 25వ తేదీ పోలింగు అనేది కూడా ఇబ్బందికరమైన తేదీ అని అంటున్నారు? కనీస ఆలోచన లేని వాళ్లనే ఎన్నికల సంఘాల్లో వేస్తుంటారా..? అనే అనుమానం దీనిద్వారా మరోసారి రేకెత్తుతుంది.

వాస్తవానికి ఈ ఎన్నికలలో రెండవ విడతలుగా POలుగా, APOలుగా విధులు నిర్వహించవలసిన టీచర్లు 24వ తేదీనాడు ఉదయం ఎన్నికల విధులు కేటాయించబడిన గ్రామాలకు వెళ్లి తిరిగి 25 నాడు ఏ అర్థరాత్రి వరకో తమ తమ ఇళ్లకు చేరుకుంటారు. మరుసటి రోజు 26 జనవరి అంటే రిపబ్లిక్ డే. ఉదయమే అన్ని స్కూళ్లలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించాలి. మరి, 23 వ తేదీ సాయంత్రమే స్కూలు నుంచి వెళ్లిపోయి ఎన్నికల డ్యూటీ ముగించుకొని 25 నాడు ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునే టీచర్లు రిపబ్లిక్ డే ఉత్సవాలకు స్కూళ్లల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకునేది ఎలా? సకాలంలో స్కూలుకు హాజరయ్యేది ఎలా? పోనీ, ఒకరిద్దరు టీచర్లను ఎన్నికల విధుల నుంచి మినహాయించారా? అంటే అదీ లేదు. హెచ్ఎంతో సహా టీచర్లందరికీ ఎలక్షన్ డ్యూటీస్ వేసేశారు. ఎక్కడన్నా టీచర్లకు ఎన్నికల డ్యూటీ రాకపోయినా మెజారిటీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది పాఠశాలల్లోనే..! 24th నాడు ఉదయమే ఎలక్షన్ అధికారులకు స్కూలును అప్పగించాలి. ఏరకంగా చూసినా రెండవ విడత ఎన్నికల తేదీ రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈవిషయాన్ని పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతో ఇప్పుడు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇక మరో విషయం బీసీ రిజర్వేషన్లపై రగడ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించి ఆర్డినెన్స్ విడుదల చేసి… ఎన్నికలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం.. ఆ డిమాండ్లను పట్టంచుకోకుండా ఎన్నికలకు సిద్ధమయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. బీసీ రిజర్వేషన్లపై చర్చ ఇప్పటిది కాదు. గత పంచాయతీ ఎన్నికల సమయంలోనూ.. ఇది ఉంది. అయితే .. అప్పట్లో.. కోర్టును ఒప్పించి.. 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించగలిగారు. ఇటీవల హైకోర్టు జనవరి ఐదో తేదీలోపు ఎన్నికలు జరపాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. అయితే.. మరి గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగాయి కదా.. అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంది.. ఇప్పటి ప్రభుత్వం ఆ చొరవ ఎందుకు తీసుకోలేదన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. చూడాలి మరి ఇది తొందరపాటో.. తప్పనిసరై వెళ్లుతన్న బాటో..!

Share.

Comments are closed.

%d bloggers like this: