ఆ సీటు విషయంలో జగన్ నిర్ణయం ఏంటి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ బలం ఎక్కువగా ఉన్న జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి. అయితే ఈ జిల్లాలో సీట్ల పంచాయితీ జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ జిల్లాపై ఎక్కువగా దృష్టి పెట్టిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో జిల్లాలోని కావలి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య లుకలుకలు పార్టీకి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది. ఓ మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీ పడుతుండగా.. జగన్ చివరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏంటి?

వైసీపీ అధినేత జగన్‌కు నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం సీటు విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. కావలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్ధి బీదా మస్తాన్‌రావుపై గెలవడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కాగా.. మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

అయితే ఈసారి మాత్రం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నియోజకవర్గంలో 2009లో ప్రతాప్ రెడ్డి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధి బీదా మస్తాన్ రావు మాజీ ఎమ్మల్యే కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డిపై గెలిచారు. అయితే 2014ఎన్నికల్లో మాత్రం ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరగా కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి… మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.. అలాగే స్థానిక నాయకులు యానాదిశెట్టి వంటివారు ప్రతాప్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన గెలిచారు. కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి సపోర్ట్ లేకుంటే ప్రతాప్ రెడ్డి గెలిచేవాడే కాదని నియోజకవర్గంలో రాజకీయ నాయకులు చెప్తుంటారు.

అయితే ఈసారి మాత్రం ప్రతాప్ రెడ్డికి అంత మద్దతు లేదని అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తనకంటూ క్యాడర్‌ను పెంచుకోవడంలో విఫలం అయ్యారు. పార్టీకి ఉన్న అభిమానులు.. కార్యకర్తలు తప్పితే ఆయనకు ప్రత్యేకంగా వర్గం లేదు. ఇటువంటి పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నప్పటికీ.. విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉండడంతో ప్రతాప్ రెడ్డి బలం తగ్గిందని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. అలాగే ఓ సామాజిక వర్గంపై ప్రభావం ఎక్కువగా చూపగలడు అనుకునే వ్యక్తి యానాది శెట్టి ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరారు. దీంతో ఈసారి కూడా ప్రతాప్ రెడ్డికే ఛాన్స్ ఇస్తే తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన వైసీపీ అధిష్టానం సీటును మరో గట్టి అభ్యర్థి అయిన విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాని పక్షంలో ఆయన ఇండిపెండెంట్‌గా కానీ కాంగ్రెస్ నుండి కానీ పోటీ చేస్తే ఎఫెక్ట్ పడుతుందని వైసీపీ భావిస్తుంది.

ఆర్థికంగానూ ప్రజాభిమానంలోనూ గట్టి అభ్యర్థి అయిన బీదా మస్తాన్ రావును ఢీకొట్టగలిగే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తుండడంతో జగన్ సిట్టింగ్‌ను కాదని సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత పాదయాత్ర సమయంలో కానీ, తెలుగుదేశం పార్టీ మారకుండా ఉన్న జగన్ వెంట ఉండడంలో కానీ ప్రతాప్ రెడ్డి మార్కులు సాధించుకున్నారు. దీంతో జగన్ ప్రతాప్ రెడ్డికి పార్టీలో ఓ ముఖ్యమైన పదవి ఇస్తారనే మాట వినిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కాస్త ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడనే ఉద్దేశ్యంతో ప్రతాప్ రెడ్డికి అవకాశం ఇవ్వగా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్ని విధాలుగా పోటీకి సంసిద్గంగా ఉండడంతో జగన్ అతనివైపు చూస్తున్నారు. ప్రతాప్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా ఎక్కువ కావడంతో ఆయన కూడా ఇందుకు ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి గతంలో అల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటంరెడ్డి తొలినుంచి వైసీపీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆయనను కాదని వైసీపీలో చేరారు. జిల్లాలో వైసీపీలో చేరిన తొలి నాయకుడు కాటంరెడ్డి మాత్రమే. జగన్ కూడా తనకు ఈసారి కావలి టిక్కెట్ ఇస్తానని మాట ఇచ్చారని, ఆయన మాట తప్పబోరని తన సన్నిహితులకు చెబుతున్నారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బోగోలు మండాలాల్లో కాటంరెడ్డికి మంచి పట్టుంది. టీడీపీ నేతలు బీద బ్రదర్స్‌ని ఢీకొట్టగలననే ఆత్మవిశ్వాసంతో ఆయన ఉన్నారు. చూడాలిమరి జగన్ నిర్ణయం ఏంటో?

Share.

Comments are closed.

%d bloggers like this: