జనసేనాని పోరాటయాత్ర ఆపేశారు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటిషియన్‌గా కాకుండా పార్ట్ టైమ్ పొలిటిషియన్‌లా ప్రణాళిక లేని రాజకీయ నేతగా మారిపోతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు డేట్‌లు ఫిక్స్ చేసుకుని.. కుదరట్లేదంటే జనంలోకి వెళ్లలేదు జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆయన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోరాట యాత్రను కూడా ఆపేశారు.పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. ఇప్పటికీ నాకు సమయం సరిపోవడం లేదు అనే కారణం చెబుతున్నారు.

రాజకీయ నేతల్లో సమయం లేదనే కారణం బహుశా… ఒక్క పవన్ కల్యాణే చెబుతారు కావొచ్చు. అధికారంలో ఉన్నా .. ప్రతిపక్షంలో ఉన్నా సమయంతో పోటీ పడి రాజకీయాలను చక్క బెట్టుకోవాలి. అంతే కానీ.. ప్రతీ దానికి సమయం లేదని తప్పించుకోవడం రాజకీయం అనిపించుకోదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓ వైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే… పార్టీని నడుపుతున్నారు. ఆయన ఒక్కో జిల్లాకు పదుల సార్లు వెళ్లారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర యాత్ర ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో నడిచారు కలుస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు కూడా సిద్దం అవుతున్నారు. మరి ఇద్దరితో పోలిస్తే.. పవన్ కల్యాణ్.. ఏమంత బిజీగా ఉన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలున్నాయి…? పదమూడు జిల్లాలు. ఈ పదమూడు జిల్లాలో తిరగడానికి కూడా.. పవన్ కల్యాణ్‌కు సమయం సరిపోలేదు. పోరాటయాత్ర చేస్తా.. కవాతు ద్వారా.. రాజకీయం చేస్తా అన్నాడు. కానీ ఐదు జిల్లాలు తిరిగే సరికే సమయం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి కాబట్టి.. పోరాటయాత్ర నిలిపివేసి.. ఆయన జిల్లాలలో అంశాల వారీ సమస్యలు తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారట. కనీసం పదమూడు జిల్లాల్లో పర్యటించలేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది పవన్ కల్యాణే. కనీసం ఐదేళ్ల కాలంలో తన పార్టీ పరిస్థితి ఏమిటి..? ఏ జిల్లాల్లో బలం లేదు.. ఎక్కడ బలం పెంచుకోవాలి.. అనే కనీసం తెలుసుకోకుండా ఆయా జిల్లాలకు వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టుకోకుండా ఉండడంపై జనసేనలోని వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ కాల్షీట్లకు అలవాటు పడిపోయారు. సంవత్సరాల తరబడి సినిమాలు తీయడం ఆయనకు అలవాటైపోయింది. దానికి ప్లానింగ్ లేదు. ఎప్పుడు డుమ్మా కొట్టాలనుకుంటే.. అప్పుడు డుమ్మాకొట్టేస్తారు. పోరాటయాత్రను కూడా అంతే చేశారు. ఎంత తీరుబడిగా చేసినా పోరాటయాత్రకు ఒక్కో జిల్లాకు ఒక్క నెల అంటే… చాలా ఎక్కువగా ఒక్కో నియోజకవర్గంలో మూడు, నాలుగు రోజులు కేటాయించవచ్చు. కానీ పవన్ కల్యాణ్… నియోజకవర్గానికి రోజు కూడా కేటాయించలేదు. కానీ సమయం గడిచిపోయింది. గత మేలో శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర చేశారు. నియోజకవర్గానికి ఒక్క రోజు కేటాయించినా.. ఈ పాటికి.. ఏపీ మొత్తం తిరిగేసి ఉండేవారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలు తిరిగేసి ఇక సమయం లేదని ఆగిపోవడం ప్రణాళిక లేని రాజకీయం అవుతుంది. కనీసం పార్టీ కార్యక్రమాల్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉంటే.. ప్రజలు ఎలా అధినేతను ఎలా నమ్ముతారంటూ జనసేనలోని ద్వితియ శ్రేణి నాయకులు అంటున్నారు.

పోరాటయాత్రలు జరిగిన తీరు… ఆపేసిన తీరు చూస్తూంటే.. పవన్ కల్యాణ్.. ఏదో కారణం చెప్పి… అసలు సవాళ్ల నుంచి తప్పించుకున ప్రయత్నం చేస్తున్నారని మాత్రం క్లారిటీ వస్తుంది. రాజకీయాల్లో పోరాడేవాడికే విలువ ఉంటుంది కానీ సాకులు చెప్పేవారికి ఉండదు. ఆ విషయం అధినేత తెలుగసుకోవాలని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనించిన పవన్‌ కల్యాణ్‌ ఆ తరహా రాజకీయాన్ని ఇక్కడ అమలు చేయాలని కొన్నినెలలుగా భావిస్తున్నారు. జేడీఎస్‌ ఆదర్శంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఏపీలో రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ జేడీఎస్‌ జాక్‌ పాట్‌గా సీఎం పీఠాన్ని పొందడమే పవన్‌ చూశాడు కానీ.. దానివెనుక కష్టాన్ని చూడలేదు. దానివెనుక ఉన్న దశాబ్దాల పార్టీ నిర్మాణాన్ని గమనించలేదు. జేడీఎస్‌ పార్టీ ఒక కుటుంబ పార్టీనే. అయితే ఆ కుటుంబీకులకు నిరంతరం రాజకీయమే వృత్తి. ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. నెలల తరబడి విరామాలు తీసుకోలేదు. అవేమీ గమనించకుండా అసలైన టైంలో టైమ్ లేదు అనడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

Share.

Comments are closed.

%d bloggers like this: