సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. ఇది పాత నినాదమే. ప్రత్యేకించి ఓసీ కులాల నుంచి ఈ మాట గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఓసీ కులాలలోని అనేకమంది పేదలు దశాబ్ధాలుగా పోరాడుతున్న అంశమే ఇది. దశాబ్దాల ఓసీల కలలను సాకారం చేస్తూ మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం అమలు సాధ్యమేనా..? కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఈ నిర్ణయంను కేంద్రం తీసుకుందా?

సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాని మోదీ కొత్త అస్త్రాన్ని సంధించారు. లోక్‌సభ ఎన్నికల్లో అగ్రవర్ణ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనకబడి అగ్రకులాల ప్రజలకు 10 రిజర్వేషన్‌లు కల్పించాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈబీసీ రిజర్వేషన్‌లకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్య సంస్థల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఆర్థికంగా వెనకబడిగన అగ్రవర్ణాల ప్రజలకు 10శాతం కోటా ఉంటుంది.

అగ్రకులాల్లో ఉన్న పేద ప్రజలు మోదీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కల సాకారమైందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈబీసీ రిజర్వేషన్‌లకు రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగవర్ణ పేదలు అర్హులని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు 5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చ.అడుగులు లోపే ఇల్లు ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండాలి. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లో ఉండాలి. అలాంటి పేద అగ్రవర్ణ ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

రిజర్వేషన్లు 50శాతం మించకూడదని 1992లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ మేరకు ప్రస్తుతం మొత్తం రిజర్వేషన్‌లు 49శాతంగా ఉన్నాయి. అందులో బీసీలకు 27శాతం, ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 16శాతం కోటా ఉంది. దీనికి తోడు ఆర్ధికంగా వెనబడిన అగ్రకులాలకు ప్రత్యేకంగా 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌లు కల్పిస్తే..మొత్తం రిజర్వేషన్ శాతం 59కి పెరగనుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే బ్రహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య.. తదితర కులాల వాళ్లు తమకూ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుండడం చూస్తున్నాం. బీసీ కులాలు, ఎస్సీలు, ఎస్టీల్లో అందరూ పేదలు కాదు.. ఓసీ కులాల్లోని అందరూ ధనికులూ కాదని.. వారి వారి ఆర్థిక శక్తిని బట్టి రిజర్వేషన్లను కల్పించాలని వీరు డిమాండ్ చేస్తూ ఉంటారు. వారు ఇప్పుడు మోదీ నిర్ణయం మంచి నిర్ణయం అంటున్నారు. కానీ ఇప్పటికే అన్ని కలుపుకుని యాభై శాతానికి చేరిన రిజర్వేషన్లశాతం మోడీ నిర్ణయంతో కలుపుకుంటే అరవైకి చేరుతుంది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు నిర్ణయానుసారాం, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం.. మోడీ కేబినెట్ నిర్ణయం చెల్లదు. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి అవకాశం ఉంది.

లోక్‌సభ, రాజ్యసభల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత టర్మ్ లో మోడీ ప్రభుత్వం ఈ మేరకు సవరణకు చట్టసభల నుంచి సిఫార్సులను చేయగలదు. అయితే దీనిపై ఇతర పార్టీలు ఏమంటాయి? అనేది ప్రశ్న. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మోడీ ఏవో సంచలన నిర్ణయాలు తీసుకుంటాడని అంతా అనుకుంటూనే ఉన్నారు. అలాంటి సమయంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అంటూ మోడీ బలమైన అస్త్రమే వదిలాడు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో చాలావరకూ అగ్రవర్ణాల సపోర్టే దానికి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఈ నిర్ణయం ప్రభావం ఉండవచ్చు. అది కూడా వార్షికాదయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉన్నవారు ఈ రిజర్వేషన్లకు అర్హులని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ అగవర్ణ యువతలో ఈ నిర్ణయంతో మోడీ పట్ల కొంత సానుకూలత ఏర్పడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక బీజేపీయేతర పక్షాలు కూడా ఈ విషయాన్ని గట్టిగా వ్యతిరేకించలేవు.

Share.

Comments are closed.

%d bloggers like this: