కాంగ్రెస్ కి గుడ్ బై.. వై‌సి‌పి లోకి మరొకరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేడు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. బీసీ గర్జన వేదికగా జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయని జగన్‌ను సీఎం చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

జగన్ తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించానని, ఇదే విషయంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశానని ఆమె స్పష్టం చేశారు. బీసీ గర్జనలో జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయని కృపారాణి తెలిపారు. బీసీలంటే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయలని .. ఈ దేశ వారసత్వాన్ని, గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలంటే బీసీలు అవసరమని జగన్ చెప్పిన విధానం బాగుందన్నారు. ఆ వర్గానికి ఎవ్వరూ సముచిత స్థానం ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే తాను వారికి సముచిత స్థానం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ప్రతి ఒక్క బీసీ కులానికి కార్పోరేషన్ పెట్టి వారి సంక్షేమం కోసం పాటుపడతానని జగన్ చెప్పారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్‌పై తనకు నమ్మకం ఉందని కిల్లి కృపారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: