లెప్టినెంట్ కల్నల్ ధోనికి కాశ్మీర్ లోయలో విధులు……

Google+ Pinterest LinkedIn Tumblr +

టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా భారత దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచిన గొప్ప క్రీడాకారుడు. అతడి సారథ్యంలోనే టీమిండియా తిరుగులేని శక్తిగా ఎదిగి వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను అందుకుంది. అయితే అతడెంత గొప్ప క్రికెటరో అంతకంటే గొప్ప దేశభక్తుడు. అవసరమైతే తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను వదులుకోడానికి సిద్దపడతాడు కానీ దేశాన్ని కాదు. అలా దేశ రక్షణ కోసం ధోని తాజాగా వెస్టిండిస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే.

భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని రెండు నెలలపాటు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ధోని పనిచేస్తున్న పారామిలిటరీ ఆర్మీ యూనిట్ ను కాశ్మీర్  లోయలో విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయి. ఈనెల(జూలై) 31 నుండి ఆగస్ట్ 15 వరకు ధోనితో సహా యూనిట్ మొత్తం అక్కడే విధులు నిర్వహించనుంది.

ఆర్మీ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ధోని కాశ్మీర్  లోయలో పాట్రోలింగ్, గార్డ్ గా సేవలు అందించనున్నాడు. అయితే అతడికేమీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదు. తన యూనిట్ సభ్యులందరి మాదిరిగానే ధోని కూడా సామాన్య  జవాన్ మాదిరిగానే విధులు నిర్వహించాల్సి వుంటుందని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

క్రికెట్ అంటే ఇష్టపడేవారంతా తనను అభిమానిస్తుంటే ధోని మాత్రం దేశ రక్షణ కోసం పాటుపడే ఆర్మీ జవాన్లను అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి  భారత ఆర్మీతో కలిసి పనిచేయాలన్న కుతూహలం పెరిగింది. ధోని ఉత్సాహాన్ని గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు అతడికి స్పోర్ట్స్ కోటాలో లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించారు.  ఇలా బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేసే పారాచూట్ రెజిమెంట్ లో చేరిన ధోని 2015 నుండి ఇప్పటివరకు  ఐదుసార్లు పారాచూట్ జంపింగ్ లో  పాల్గొన్నాడు. ఇలా ఆగ్రా ట్రెయినింగ్ క్యాంప్ లో ఆర్మీ విమానం పై నుండి దూకి ధోని అధికారికంగా పారాట్రూపర్ గా మారాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: