ఊరించి..ఊసూరు మనిపించిన బడ్జెట్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణాలో కొలువు తీరిన ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఊరించి..ఉసూరుమనిపించింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, మహిళాభివృద్ది, తదితర రంగాలపై పూర్తి స్థాయిలో కేటాయింపులు చేపట్టలేదంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్ధిక క్రమశిక్షణ లేక పోవడం కూడా ప్రధాన కారణం. మొత్తం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతోనే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. కేంద్ర ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్ అన్నారు. ఇందు కోసం 1,336 కోట్లు కేటాయించామని, దీని వల్ల 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన 450 కోట్లను కేంద్రం ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలను పెంచామన్నారు. వాటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. శాంతి భద్రత భేషుగ్గా ఉందన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు.
గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా ఉందన్నారు సీఎం. ఉన్న బకాయిలు చెల్లించిన తర్వాతనే కొత్త పనులు చేపడతామన్నారు. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తాగడానికి ప్రధాన కారణం ఆర్ధిక మాంద్యమేనని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని కేసీఆర్ వెల్లడించారు.

రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆగవని, ఉచిత విద్యుత్‌ కోసం 20,925 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి 5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించిందన్నారు. దీంతో అధిక భారం పడిందన్నారు. గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు.పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయించగా, అభివృద్ధి, సంక్షేమం కోసం. 5,37,373 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడిందన్నారు. తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 10.2 శాతానికి పెరిగిందన్నారు. 6.త్రీ శాతం అదనపు వృద్ధి రేటను, వ్యవసాయ రంగంలో 8.1 శాతం, ఐటీ రంగంలో 11.05 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. మొత్తం మీద ఉద్యోగాల కల్పన, మహిళా సంక్షేమం రంగాల గురించి ఊసే లేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: