నవ్వుల వెనుక నాగబాబు కష్టాలు..! నాగబాబు బర్త్ డే స్పెషల్ స్టోరీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అయితే వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కున్నారన్నదే ఆయా వ్యక్తుల ఆలోచనాధోరణిని బట్టి ఉంటుంది. పేరుకే మెగా బ్రదర్ అయినా, అప్పట్లో ఆర్ధిక నష్టాలతో ఆత్మహత్య యత్నం వరకు వెళ్ళిన నాగబాబు, ప్రస్తతం నేలకు కొట్టిన బంతిలా కెరీర్ లో స్థిరపడ్డాడు. నాగబాబు సినీ ప్రస్థానంలో ‘ఆరెంజ్‌’కి ముందు, ‘ఆరెంజ్‌’కి తర్వాత అనే ఫేజ్‌ల్ని.., పరిస్థితులు సృష్టించినా ఆత్మవిశ్వాసం, చిరునవ్వు అనే ఆయుధాలతో ఎదుర్కొని మళ్ళీ సక్సెస్‌బాటలో పయనిస్తున్న తీరు ఎందరికో ఆదర్శప్రాయం.

సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చవిచూసినా ధైర్యంగా నిలబడి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు మెగా బ్రదర్ నాగ బాబు . సినిమాల్లోని ముఖ్యపాత్రల్లోనే కాకుండా సీరియల్స్‌, ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగబాబు పుట్టినరోజు నేడు . 1961లో పశ్చిగోదావరి జిల్లా మొగల్తూరులో నాగబాబు జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా రాణిస్తున్న రోజుల్లో సినీ రంగ ప్రవేశం చేసిన నాగబాబు హీరోగా ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నాటి నుంచి నేటి వరకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలకి నాగబాబు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ‘కౌరవుడు’ చిత్రంలోని ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఆయన ‘ప్రేమాభిషేకం’, ‘మృగరాజు’, ‘అన్నవరం’, ‘రాక్షసుడు’, ‘మురారి’, ‘అంజి’, ‘కొండవీటి దొంగ’, ‘మరణ మృదంగం’, ‘త్రినేత్రుడు’, ‘ఆపరేషన్‌ దుర్యోదన’, ‘శ్రీ రామదాసు’, ‘చందమామ’, ‘ఆరెంజ్‌’, ‘మిరపకారు’ ,’సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు.

అలాగే నిర్మాతగా భారీ చిత్రాలను రూపొందించారు. ‘అంజనా ప్రొడక్షన్‌’ పతాకంపై అన్నయ్య చిరంజీవితో ‘రుద్రవీణ’ చిత్రాన్ని నిర్మించి జాతీయ అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ‘త్రినేత్రుడు’, ‘ముగ్గురు మొనగాళ్ళు’, ‘బావగారు బాగున్నారా’, ‘గుడుంబా శంకర్‌’, ‘స్టాలిన్‌’ వంటి చిత్రాలను నిర్మించారు. అయితే వరుస ఎత్తుపల్లాలతో సాగుతున్న నాగబాబు కెరీర్లో అనుకోని దుర్ఘటన అరేంజ్ మూవీ. రామ్‌చరణ్‌ హీరోగా నిర్మించిన ‘ఆరెంజ్‌’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ నష్టం రావడంతో ఆర్థికంగా బలహీన పడ్డాడు. తన బాగుకోసం అన్నయ్య చిరంజీవి చేసిన సహాయాన్ని వినియోగించుకోలేక, అన్నయ్యకు మొహం చుపెట్టలేక, తీవ్రమైన ఆర్ధిక కష్టాలతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట నాగబాబు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. అయితే ఆత్మస్థయిర్యాన్ని పెట్టుబడిగా పెట్టి పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు నాగబాబు. తన పనైపోయిందని అనుకున్నవారంతా ఆశ్చర్యపోయేలా మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్‌ సాధించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదే తరుణంలో ఆద్యంతం నవ్వుల్ని పండించే ‘జబర్దస్త్‌’ కామెడీ షో నాగబాబును సక్సెస్‌బాటలోకి తీసుకొచ్చింది.

షో జడ్జి స్తానం నుండి జబర్దస్త్ క్రియేటివ్ హెడ్ వరకు ఎదిగిన నాగబాబు, వీటితోపాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ మంచి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అప్పట్లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ కు తన పూర్తి సహాయ సహకారాల్ని అందించారు. నాగబాబుని స్ఫూర్తిగా తీసుకుని రాజేంద్రప్రసాద్ , శివాజీ రాజా, ఇప్పుడు నరేష్ వంటి పలువురు సినీ ప్రముఖులు సైతం ‘మా’ కార్యక్రమాలు విజయవంతమవ్వడానికి కృషి చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగానో, పవన్‌కళ్యాణ్‌ అన్నయ్యగానో ఆయన ఏనాడూ హంగూ ఆర్భాటాలకు వెళ్ళలేదు. కుటుంబ సమస్యనైనా, అభిమానుల సమస్యనైనా సమయస్ఫూర్తితో పరిష్కరించటంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ఎటువంటి విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. బాలకృష్ణ లాంటి వాళ్లకు కూడా తన చానెల్ ద్వారా ప్రశ్నిస్తూ మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారిన నాగబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Share.

Comments are closed.

%d bloggers like this: