ఇసుక లేక పనులు లేక.. రాలిపోతున్న ప్రాణాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్ర లో ఇసుక కొరత తారా స్థాయికి చేరింది.. పనులు లేక ఇప్పటికే ఎందరో కార్మికులు రోడ్డున పడ్డారు. భవన నిర్మాణం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ ఎందరో ఉపాధి పై పడింది. ఉపాధి కార్మికులు నిర్మాణాలు ఆగిపోయి పనులు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించడం వాళ్ళకి ఇప్పుడు పెద్ద సవాలుగా మారిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు దొరకక కొందరు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.. ఇప్పటికే ఎందరో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో కార్మికుడు చేరాడు. శ్రీనివాస్ (50) అనే కార్మికుడు తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన కట్టా శ్రీనివాసరావు(50) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నందివెలుగు గ్రామానికి చెందిన కట్టా శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తెనాలిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. శ్రీనివాసరావు స్వస్థలం నందివెలుగు కాగా కొద్ది సంవత్సరాలుగా తెనాలి నందులపేటలోని ఎరుకల కాలనీలో భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ, కూలి పనులకు వెళ్తున్నాడు. అయితే తాపీ పనులతో పాటు భవన నిర్మాణంలో ఏ పని దొరికినా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడని సన్నిహితులు చెబుతున్నారు.

అయితే రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ఏర్పడిన ఇసుక కొరతతో రోజు వారీ కూలి పనులు లేక, కుటుంబ పోషణ భారంగా మారి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఈ బాధతోనే మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి పెద్ద దిక్కు అయిన శ్రీనివాసరావు బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాసు కు భార్య పార్వతితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే పోలీసులు, శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందినట్లు తమకు తెలిసిందని అంటుండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: