Email Us:
mahaatelugunews@gmail.com

అమెరికా కాల్పుల్లో 11మంది మృతి.. ట్రంప్ సీరియస్.!

28-October-2018,America
అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. యూదుల ప్రార్థనాలయంలో శనివారం (అక్టోబర్ 27) ఓ ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఓ చిన్నారి నామకరణోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో అమాయక ప్రజలు బలయ్యారు.
అమెరికాలోనే అత్యంత దారుణమైన సంఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దుండగుడిని స్థానికుడైన 46 ఏళ్ల రాబర్ట్ బోవర్స్ గా గుర్తించారు. దీన్ని ద్వేషపూరిత చర్యగా భావిస్తున్నారు. దుండగుడు యూదులందరూ మరణించాలని అరిచాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపైకి అతడు కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అతి కష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేట్ క్రైమ్ కింద, ఇతర ఫెడరల్ చార్జెస్ కింద అతన్ని విచారించే అవకాశం ఉంది. దీని కింద అతనికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రతిస్పందించారు. యూదులకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. సామూహిక హత్యలు అత్యంత కిరాతకమైనవని అన్నారు.