Email Us:
mahaatelugunews@gmail.com

సోనియా, రాహుల్ రాకతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం..!

24-November-2018,Telangana
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. ప్రజాకూటమి తరఫున ఏర్పాటుచేసిన తొలి భారీ బహిరంగసభను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఆమె తనయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. సభకు హాజరైన జనంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద సభ విజయవంతం కావడం ప్రజాకూటమిలో జోష్‌ నింపింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని రాజేసింది. మేడ్చల్‌ వేదికగా సోనియా సభను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభను మొదట్లో వరంగల్‌ లేదా కరీంనగర్‌లో నిర్వహించాలనుకున్నా చివరకు హైదరాబాద్‌ చుట్టుపక్కల నిర్వహించాలని నిర్ణయించి మేడ్చల్‌ను ఎంపిక చేశారు. మూడు లక్షల మందితో సభను నిర్వహించాలని నిర్ణయించి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పూర్వపు రంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల నుంచి జనసమీకరణ చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు అందరూ ఈ సభలో పాల్గొన్నారు. మేడ్చల్‌ సభను హైదరాబాద్‌, పూర్వపు రంగారెడ్డి జిల్లాల లక్ష్యంగా ఏర్పాటు చేసినప్పటికీ మెదక్‌, వరంగల్‌ జిల్లాలపై కూడా అనుకూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.