Email Us:
mahaatelugunews@gmail.com

ఏం చేసినా ప్రజల కోసమే..!!

14-September-2018,AndraPradesh
బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి సీఎం హారతిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో జలహారతి జరుగుతుందని, నీళ్లు ఎక్కడుంటే అక్కడ జలహరతి ఇవ్వాలని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని, నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. ఎత్తయిన అనంతపురానికి నీళ్లు తీసుకువెళ్లాలంటే లిఫ్ట్‌ తప్ప మరో మార్గం లేదని, అందుకే లిఫ్ట్‌లు పెట్టి నీటిని తీసుకెళ్తున్నామన్నారు. ఈ ఏడాది వర్షం తక్కువ పడడంతో పంటలు దెబ్బతింటున్నాయని, చెరువులు కింద ఉండే పంటలకు ఏ మాత్రం ఢోకా లేకుండా హంద్రీనీవా ద్వారా 50 చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే జనవరి నాటికి 46 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పనులు ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చంద్రబాబు అన్నారు. 2500 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని, ఆ నీళ్లు ఇక్కడికి వస్తే శ్రీశైలం నిండిపోతుందని, నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పట్టిసీమ ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ఈనెలలో 12, అక్టోబర్‌లో 3, డిశంబర్‌లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనేదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్లపై స్పందిస్తూ... బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాను. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశాను. కానీ బాబ్లీ కేసులో నాకు నోటీలిచ్చామని అంటున్నారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను. ఇప్పుడు నోటీసులు.. అరెస్ట్ వారెంట్లు అంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి" అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు.. తాను ఏ పనిచేసినా ప్రజల కోసమేనని చెప్పారు.