Email Us:
mahaatelugunews@gmail.com

రాజకీయపొత్తులు... రణరంగపు జిత్తులు..!

11-October-2018,Hyderabad, Telangana
ఎన్నికలంటే… రాజకీయపొత్తులు రణరంగపు జిత్తులు అని మరోకసారి నిరూపితమైంది. ఎన్నికలు దగ్గరకొస్తున్న మహాకూటమి ద్వారా తెలంగాణలో జెండాను ఎగురవేయాలనుకున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత మురళీధరరావు సమక్షంలో గురువారం ఆమె బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పద్మినీరెడ్డి నమ్మకాన్ని తాము స్వాగతిస్తున్నామని మురళీధరరావు అన్నారు.
కాగా, ప్రస్తుతం దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో ఉండగా పద్మినీరెడ్డి బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్ వర్గాలు నివ్వెరపోయాయి. పద్మినీరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి టికెట్ ఆశించారు.
అయితే, ఆమెకు పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా పరిణామం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన వ్యవహారంపై రాజనర్సింహ ఇంకా స్పందించలేదు.