Email Us:
mahaatelugunews@gmail.com

ఘనవిజయం.. చెలరేగిన కోహ్లీ, రోహిత్.!

22-October-2018,New Delhi
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని కూడా ఎంతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్‌శర్మ, కెప్టెన్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పోటీ పడి మరీ విండీస్ బౌలర్లను చితకబాదారు. విరాట్ కోహ్లీ(140: 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ రోహిత్ శర్మ(152 నాటౌట్: 110 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో చేలరేగడంతో విండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్మేయర్ (78 బంతుల్లో 106; 6×4, 6×6) సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. ఇతడికి తోడు ఓపెనర్ కీరన్ పావెల్ (39 బంతుల్లో 51; 6×4, 2×6), షాయి హోప్ (51 బంతుల్లో 32; 2×4), రోవ్‌మన్ పావెల్ (23 బంతుల్లో 22; 4×4) రాణించారు. ఆఖర్లో దేవేంద్ర బిషూ(26 బంతుల్లో 22; 2×4), కీమర్ రోచ్ (22 బంతుల్లో 26; 2×4) దూకుడుగా ఆటడంతో విండీస్ భారీ స్కోరు సాధించింది. దీంతో విండీస్ 323 పరుగుల భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ 3 వికెట్లు పడగొట్టగా , మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు సాధించారు.

323 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి ఇంకా 47 బంతులు మిగిలి ఉండగానే అవలీలగా అందుకుంది. లక్ష్య చేధనలో శిఖర్‌ ధావన్‌ నాలుగు పరుగులకే నిష్క్రమించినా రోహిత్‌శర్మ- విరాట్‌ కోహ్లిలు సెంచరీలతో కదం తొక్కారు. ముఖ్యంగా విండీస్‌ బౌలర్లును కోహ్లి ఊచకోతకోస్తూ వాయువేగంతో 140 పరుగులు (107 బంతుల్లో రెండు సిక్స్‌లు, 21 ఫోర్లు) చేశాడు. మరోవైపు రోహిత్‌ 152 పరుగులతో (117 బంతుల్లో 8 సిక్స్‌లు, 15 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించింది. కోహ్లి అవుట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు 22 పరుగులు (26 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌) నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కోహ్లిని ఎంపిక చేశారు. ఆదివారం మ్యాచ్‌తో వన్డేల్లో 36వ శతకాన్ని కోహ్లి అందుకున్నాడు. అలాగే వన్డేల్లో 20 సెంచరీలు చేసిన రోహిత్ అందులో ఆరుసార్లు 150కిపైగా స్కోర్లు చేసి, వరల్డ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.