Advertisements

CRDA Tour in Amaravathi

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ప్రజలు తిలకించేందుకు వీలుగా అమరావతి సందర్శన యాత్రను సీఆర్‌డీఏ చేపట్టింది. అమరావతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా చూసేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ యాత్ర అసలు ఎందుకోసం.. ఖర్చు పెట్టిమరీ అమరావతి సందర్శన యాత్ర చేయించవలసిన అవసరం ఏంటి?

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయినా లేక ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణమైనా ఎప్పుడూ జరగవు. అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో రాజధానిని, పోలవరంను కట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ వైపు లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా అమరావతిలో నిర్మాలను పూర్తి చేస్తూ.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. అయితే టీడీపీ నేతలు రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై నెగెటివ్‌గా ప్రజల్లోకి పోతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలను బస్సుల్లో తీసుకొచ్చి రాజధానిలో అభివృద్ధి పనులు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి మూడు రోజుల్లో 13 జిల్లాల్లోని 13 మండలాలకు చెందిన సుమారు 500 మందిని ప్రతీ సామాజిక వర్గం నుంచి అమరావతికి తీసుకువచ్చి చూపించాలని ప్రభుత్వం భావించింది. వారికి భోజన ఏర్పాట్లును కూడా ఏపీసీఆర్‌డీఏనే చూసుకుంటుంది. సీఆర్‌డీఏ నుంచి జిల్లా కలెక్టర్‌ నిధులు డ్రా చేసి రవాణా, ఇతరత్రా ఖర్చులకు వినియోగిస్తారు. ఈ సందర్శన యాత్రకు వచ్చేవారికి అన్నీ సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగానే కల్పిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మ కంగా అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోని మేటి ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకొని మాస్టర్ ప్లాన్ గీయించారు. 34వేల ఎకరాల విలువైన భూమిని రైతులు భూసమీకరణ కింద రాజధానికి ఇచ్చారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాజధానిలో గత రెండేళ్లుగా పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఏమీ జరగట్లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంతో ప్రభుత్వానికి నెగెటివ్ ఇమేజ్ వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఈ టూర్‌కు వచ్చిన వాళ్లు ఆ నిర్మాణాలను ఫోటోలు.. వీడియోలు తీసి తమకు తెలిసినవారికి ఊర్లలో చూపించాలని ప్రభుత్వం కోరుతుంది. తద్వారా రాజధాని పనులు ఎలా జరుగతున్నాయనే విషయాన్ని వాళ్లే మాట్లాడుకుని తెలుసుకుంటారు. అలాగే అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక కూడా ప‌డలేద‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌లకు స‌మాధానం కూడా చెప్పినట్లు అవుతుందనేది వారి భావన.

వాస్తవానికి అమరావతిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామాల్లో గ్రామీణ వాతావరణం పోయి పట్టణీకరణ సంతరించుకుంది. సువిశాలమైన నాలుగు, ఆరు వరసల రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి. వీటితో పాటు లేఅవుట్ల అభివృద్ధి పనులు కొనసాగుతుయి. అసెంబ్లీ, సచివాలయం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు భవన సముదాయాలు, ఇళ్లు లేని రాజధాని వాసులకు అపార్టుమెంట్‌ ఇళ్లు, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు స్పీడ్‌ అందుకొన్నాయి. ఇంతకంటే ముందే విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీల తొలి దశ పనులు పూర్తి అయి అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నా యి. వీటన్నింటిని ప్రజలకు చూపించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి కలిగిన వారంతా ఒక బృందంగా ఏర్పడి కలెక్టర్‌ని సంప్రదిస్తే రవాణ సౌకర్యం కల్పిస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయం, అమరావతి రాజధాని సందర్శన ఒక్కరోజులో చూపిస్తారు. అల్పాహారం, భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

ఏపీ నూతన రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన మాస్టర్‌ప్లాన్‌ నమూనాలు చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత జగన్ కూడా భ్రమరావతి అని ఎగతాళి చేసారు. పవన్ ఏమో అసలు ఇక్కడ ఒక్క ఇటుకు కూడా లేదు అంటూ చెప్పేశారు. అయితే ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను సీఆర్‌డీఏ ఇంటర్నెట్‌లో పెట్టింది. అయితే అవి కూడా గ్రాఫిక్స్ అనేవారికి సమాధానమే ఈ అమరావతి సందర్శన అని ప్రభుత్వం చెప్తుంది.

రాజధానిలో రవాణా వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా గీత గీసినట్లు ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే సింగపూర్‌ సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను రూపొందించింది. ఆ ప్రకారమే రాజధానిలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని ప్రజలకు చూపించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా ప్రచారానికి ఉపయోగించే ఖర్చు తగ్గి నిజాలు ప్రజలు తెలుసుకుంటారని అధికారులు చెప్తున్నారు. చూడాలిమరి అమరావతి సందర్శన ఏ మేరకు ప్రభుత్వానికి ఫలిస్తుందో?

Advertisements
Share.

Leave A Reply

%d bloggers like this: