తెలంగాణాలో ప్రజాకూటమి పొత్తులో భాగంగా పోటీ చేసిన తెలుగుదేశం.. కాంగ్రెస్ పార్టీలు.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పొత్తు కొనసాగిస్తాయా? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశంతో పొత్తుతో తెలంగాణలో నష్టం జరిగిందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు ఉంటుందా? కాంగ్రెస్ నేతల మాటలతో పొత్తు అంకం ముగిసినట్లేనా? పార్టమెంటు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ ఓటమికి టిడిపితో పొత్తే కారణమని రాయలసీమ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసివుంటే మంచి ఫలితాలు వచ్చేవని, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో వాడిన డైలాగులను తెలంగాణ ఓటర్లు నమ్మలేదంటూ బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిడిపితో కాంగ్రెస్ పార్టీ జతకలిస్తే తెలంగాణలో వచ్చిన ఫలితమే వస్తుందని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ నిండా మునగడం ఖాయమని, కాబట్టి 2019ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని…రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని బైరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ ఓటమికి టిడిపి పొత్తు కారణం కాదంటున్న సమయంలో బైరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. అలాగే కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే టిడిపి వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తమ ఓటమికి పొత్తులు కారణం కాదని పేర్కొన్నారు. పొత్తుల ప్రక్రియ కొద్దిగా ముందు జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, దీనికి భిన్నంగా ఏపీలోని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పొత్తులు పెట్టుకుంటే ఇదే పరిస్థితి మళ్లీ వస్తుందని తెలుగుదేశం నేతలు కూడా భావిస్తున్నారు. పొత్తు వల్ల పెద్దగా ఒరిగేదేం లేదని, ఒంటరిగానే పోటీ చేయాలని అంటున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు వదులుకుంటే పార్టీకే నష్టం అని చెప్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలపై పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యేందుకు పీసీసీ కూడా సిద్ధమౌతోంది. మరో రెండురోజుల్లో సమీక్ష సమావేశాలు జరపాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రజా కూటమి పరిస్థితి ఏంటనేది కూడా త్వరలోనే తేలిపోనుంది.
లోక్ సభ ఎన్నికల్లో కూడా వీరంతా కలిసికట్టుగా పోటీ చేస్తారా..? లేదంటే, కాంగ్రెస్ సొంతంగా పోటీకి దిగుతుందా అనేది చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే హైకమాండ్‌కి టీపీసీసీ ఒక నివేదిక పంపింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే నష్టపోయామని కొంతమంది నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, పీసీసీకి అలాంటి అభిప్రాయం లేదని సమాచారం. ఎన్నికల కమిషన్ చేసిన పొరపాట్ల కారణంగానే దాదాపు 15 సీట్లలో సీట్లు కోల్పోవాల్సి వచ్చిందనేది పీసీసీ అభిప్రాయంగా తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థుల ఎంపికలో కూడా పొరపాట్లు జరిగినట్టు హైకమాండ్‌కి పంపిన నివేదికలో పేర్కొన్నారు.
పీసీసీ అభిప్రాయం చూస్తుంటే మాత్రం లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీతో కలిసి కొనసాగే అవకాశాలు కొంత ఉన్నట్టుగానే కనిపిస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే… ప్రజా కూటమి కొనసాగింపు సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఇక్కడున్న మరో సమస్య.. ఆంధ్రాలో కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు టీడీపీ సిద్ధపడుతుందా అనేదే. చూడాలి మరి పొత్తులు ఉంటాయో..? ఒంటరిపోరు ఉంటుందో?