Advertisements

సర్వేలతోనే సీట్లు.. నేతలలో గుబులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎన్నికల వేడి సర్వేల ఆధారంగానే సీట్లు అంటున్న పార్టీలు ప్రజల ఆమోదం పొందినవారే పార్టీ అభ్యర్ధులు ఆన్‌లైన్‌‌లోనూ.. ఫోన్‌ కాల్స్‌ ద్వారా సర్వేలు జాతీయ రాజకీయాల దృష్ట్యా పొత్తులు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి దగ్గరపడుతోంది. మరో రెండు నెలల్లో ఈ హీట్ ఇంకా పెరగబోతుంది. అయితే సంక్రాంతి పండుగ నాటికి పార్టీలు మొత్తం వారి అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీలు చేసుకుంటున్న సర్వేలే కీలకం కానున్నాయా? సర్వేల ప్రకారమే పార్టీలు నేతలకు సీట్లు కేటాయిస్తున్నాయా? గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామంటున్న అధినేతలు.. సీట్లు దొరకని వారి దారెటు..?

ఎన్నికల ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రతగా అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే సీట్లు కేటియించాలని నిర్ణయించుకుంటున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు.. సర్వేలు చేయించుకుని వాటి ప్రకారమే అభ్యర్థులను నిర్ణయిస్తున్నాయి. ప్రజల అభియమానం ఎవరిపై ఉందో తెలుసుకునేందుకు పార్టీలు ప్రత్యేకమైన సర్వేలు చేయిస్తున్నాయి. ప్రజలు ఏ నాయకుడి వైపు ఎక్కువగా ఉన్నారు… ఏ నేతకు జై కొడుతున్నారో… తెలుసుకుని వారికి మాత్రమే సీట్లు కేటాయిస్తున్నాయి. ప్రత్యామ్నయం లేని చోట్ల మాత్రం ఉన్నవారికే సీట్లు కేటాయిస్తున్నాయి.

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఆన్‌లైన్‌ ద్వారా, ఫోన్‌ కాల్స్‌ ద్వారా గణాంకాలు తీసుకున్నాయి. బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. తమ పార్టీ తరపున బరిలో దింగేందుకు పోటీపడుతున్న వారిలో సమర్థులు ఎవరు? అనే అంశంపై అధికార టీడీపీ, వైసీపీలు సర్వేలనే నమ్ముకుంటున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీల తరఫున పోటీ చేయాలనుకునే ఆశావాహులకు, సిట్టింగులకు సర్వేలు సంకటంగా మారాయి. అధికార తెలుగుదేశం విడతలువారీగా సర్వేలు జరపగా… వైసీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ బృందాలు సర్వేలను జరుపుతున్నాయి. వారి సర్వేలో తేలిన అభ్యర్ధులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని అనుకంటున్నాయి.

ఇక జనసేన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం.. వైసీపీలు పక్కనబెట్టిన వ్యక్తులను తీసుకుని వారికి సీట్లు ఇస్తే వారికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడై విజయం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం ఇప్పటికే చేసిన సర్వేల ఆధారంగా సంక్రాంతికి అభ్యర్ధులను ప్రకటించనుంది. అలాగే ప్రశాంత్‌కిషోర్‌ బృందం నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి ఇచ్చిన నివేదికల ప్రకారం ఇదే నెలలో అభ్యర్ధులను ఖరారు చేయబోతుంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సర్వేల పేరిట ఎడాపెడా వస్తున్న అంచనాలు నాయకుల్లో కూడా కలవరం పుట్టిస్తున్నాయి.

ఈసారి అధికార తెలుగుదేశంలోనూ.. ప్రతిపక్ష వైసీపీలోనూ.. గెలుపొందే వారికే ఈసారి సీట్లు కేటాయిస్తాం.. ఒక నిర్దిష్ఠ పద్ధతినే పాటిస్తాం.. మొహమాటాలకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అంటూ నాయకులు చెప్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ప్రకటిస్తాం అంటూ చెప్తున్న అధినేతల వ్యాఖ్యలతో కొందరికి స్పష్టత రావడంతో వారి దారి వాళ్లు చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. జనవరి నెలలోనే అభ్యర్థుల తొలిజాబితా ప్రకటిస్తామని తెలుగుదేశం వెల్లడించడంతో ఆ పార్టీ జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సిట్టింగులతోపాటు, ఆశావహుల్లోనూ టెన్షన్ మొదలైంది. బయటకు ధీమాగా కనిపిస్తున్నప్పటికీ జాతీయ రాజకీయాల దృష్ట్యా పొత్తులు, 40 శాతం ఎమ్మెల్యేల మార్పు వంటి ప్రకటనలతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.

వైసీపీలోనూ అదే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. బయటకు మా విజయం ఖచ్చితం అని చెప్తున్నప్పటికీ.. పార్టీ సీనియర్లు సైతం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పీకే సర్వేను ప్రస్తావిస్తూ వస్తున్నారు. సర్వే ద్వారా ప్రజాభిమానం.. ఆర్థిక పరంగా బలవంతుల కోసం వైసీపీ అన్వేషణ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సర్వేల నివేదికతో పాటు ఆర్థిక స్థోమతలను బేరీజు వేసుకుని అభ్యర్ధులను ఖరారు చేయాలని భావిస్తుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం పొత్తులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీల జాతీయ నేతల సూచనల మేరకు పొత్తులు ఉంటాయంటున్నా గతంలో బలంగా ఉన్న నాయకులు… పొత్తుల్లో భాగంగా తమకు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇక జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి ప్రజాపోరాటాల్లో పాల్గొంటోంది. ఆ పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చన్న భావన నాయకుల్లో ఉంది. దీంతో వామపక్ష పార్టీల్లో కీలక నేతలు మళ్లీ తాము కొన్ని నియోజకవర్గాల్లో చక్రం తిప్పగలమన్న ఆశతో ఉన్నారు. చూడాలి మరి సర్వేలు నేతలను గట్టెక్కిస్తయో? దింపేస్తాయో..?

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: