రసవత్తరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు జనసేనను లైట్ తీసుకోమనే సందేశమేనా? పవన్ కల్యాణ్‌కు టీడీపీ నుంచి ఇదొక పెద్ద సవాల్. బీజేపీయేతర కూటమిలో చేరాలంటూ పిలుపు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి తెరలేపాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ వివిధ రకాల చర్చలు సాగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా? చంద్రబాబుతో కలుసి పోటీ చేస్తారా..? లేక మరెవరుతోనైనా జత కడతారా? అనే చర్చ సాగుతోంది. అసలు చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి?
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల మధ్య పొత్తులు.. సమీకరణాలు మీద చర్చ జరుగుతుంది. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన జనసేన.. వైసీపీలు తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో డిఫెన్స్‌లో పడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గెలుపు ఏమో కానీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల గెలుపై ఆయన ప్రభావం చాలావరకు ఉంటుందనేది చాలా కాలంగా జరుగుతున్న చర్చ. పవన్ కారణంగా ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితులు ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాతో కలిస్తే జగన్‌కు ఏం సమస్య అని, ఆయన తమతో కలిసి బీజేపీయేతర కూటమిలో కలవాలని కూడా చంద్రబాబు ఆహ్వానించారు.
అయితే ఇది చంద్రబాబు వేసిన ప్రణాళికలో భాగం అని చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకునే ఉద్దేశ్యం టీడీపీకి లేకపోవచ్చునని నమ్మిస్తూ వైకాపా శ్రేణులను ఒత్తిడికి లోను చేసేందుకు వేసిన వ్యూహంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే నిన్నటి వరకు విమర్శలు గుప్పించిన చంద్రబాబు హఠాత్తుగా ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చుననేది తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తెరవెనుక ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా అనే చర్చ కూడా సాగింది.
ఒక రాజకీయ నాయకుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడంటే అదే నిజమన్న భ్రమలో పడిపోరాదు. దాని వెనుక అతని ఉద్దేశం ఏమై ఉంటుందో ఆలోచించాలి.
చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా జనసేనను లైట్ తీసుకోండి.. వైసీపీనే మన ప్రత్యర్ధి అనే సందేశాన్ని కార్యకర్తలకు శ్రేణులకు ఇచ్చే ప్రయత్నం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. జనసేన మావైపే ఉంది. అని ప్రతిపక్ష పార్టీ వైసీపీని అయోమయంలో పడేయడమూ ఇందులో భాగం అని చెప్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకునే ఉద్దేశ్యం టీడీపీకి లేకపోవచ్చునని నమ్మిస్తూ వైకాపా శ్రేణులను ఒత్తిడి కి లోను చేసే ఉద్దేశం కూడా ఇందులో ఉండవచ్చు.
అయితే చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఒకవేళ ఎన్నికల్లో పొత్తు లేకున్నా.. కేంద్రంలో బీజేపీయేతర కూటమికి మద్దతుల కూడగట్టడంలో భాగంగా.. పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండే అవకాశం కూడా ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చుననేది తెలిసిందే. దశాబ్దాల విరోదులు అయిన కాంగ్రెస్ తెలుగుదేశమే కలిశాయి. అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఓ రకంగా ఇది.. పవన్ కల్యాణ్‌కు టీడీపీ వైపు నుంచి వచ్చిన అతి పెద్ద సవాల్. ఇప్పుడు పవన్ కల్యాణ్.. తాను టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. మాటలతోనే కాదు అంతకుమించి రాజకీయ వ్యూహచతుర అవసరం.
మరోవైపు జగన్మోహన్ రెడ్డి కొంత కాలం కిందటి నుంచి పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. జనసేన నాలుగో ఆవిర్భావ దినోత్సవ సమయంలో.. చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేయక ముందు.. పవన్ కల్యాణ్‌ను జగన్ ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. అసలు సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అన్నట్లుగా మాట్లాడేవారు. నాలుగో ఆవిర్భావ దినోత్సవం తర్వాత విమర్శించడం లేదు. పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టినంత కాలం వైసీపీ కూడా పవన్ పై సాఫ్ట్ కార్నర్ చూపించింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో.. పవన్ కల్యాణ్ కూడా జగన్ పై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. అందుకే ఒకప్పుడు.. అసభ్యంగా సైగలు చేస్తూ.. రబ్బర్ సింగ్ అంటూ పవన్ ను విమర్శించిన రోజా లాంటి వాళ్లు కూడా.. పవన్‌కు మంచోడంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు.
అయితే ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. మళ్లీ జగన్.. పవన్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఫెయిలైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కారణం ఏదైనా… ఇప్పుడు.. జగన్‌తో.. పవన్ కలిసే చాన్స్ లేదు. అందుకే చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇప్పుడు.. పవన్‌కు జగన్ వైపు నుంచి వస్తున్న వ్యూహాత్మక ప్రచారాన్ని తిప్పికొట్టగలగాలి. ఈ విషయంలో తాను టీడీపీకి దగ్గర కాబోనని వివరణ ఇస్తే… మరింత ఇరుక్కుపోయినట్లవుతుంది. వైసీపీ.. అలాంటి ప్రచారం మళ్లీ చేయకుండా.. పవన్ కల్యాణ్ తన రాజకీయ చతురత అంతా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక ఎవరికీ దగ్గర కాదని పవన్ నిరూపించుకోలేకపోతే ఆయన రాజకీయ పరిణితి లేని తనాన్ని ఆసరాగా చేసుకుని.. అటు చంద్రబాబు, ఇటు జగన్ కూడా రాజకీయ తెరపై జనసేనను.. నామమాత్రం చేసే ప్రయత్నాలు చేస్తారు. చూడాలి మరి ఎవరి వ్యూహం ఫలిస్తుందో..?