తెగదెంపులు తర్వాత మోదీపై దూకుడు పెంచిన ముఖ్యమంత్రి చంద్రాబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

మోదీకి చాలెంజ్ విసిరిన చంద్రబాబు ఆంధ్రుల దృష్టిలో మోదీని నేరగాడిగా నిలబెట్టిన చంద్రబాబు చేతకాని నిర్వాకంతో దేశాన్ని మోదీ శిథిలం చేస్తున్నారంటూ ఆగ్రహం చంద్రబాబు సవాల్‌ను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేని బీజేపీ.

కేంద్రంలోని అధికార బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు మోదీ పైన ఆయన విధానాల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు కూడా మోదీకి కౌంటర్ ఇచ్చారు. చర్చకు సిద్దమా? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు విసిరన చాలెంజ్‌ను మోదీ స్వీకరిస్తారా?

తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని బీజేపీతో పొత్తులు తెంచుకున్నాక చంద్రబాబు దూకుడుగా ప్రధాని మోదీపై కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. గత ఆరుమాసాలుగా బీజేపీ మీద, ప్రత్యేకించి ప్రధాని మోడీ మీద ఒంటికాలుతో లేస్తూ, బహిరంగంగా పలు విమర్శలను చేస్తూ, మోడీని ద్రోహిగా, అసమర్దుడిగా రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తిగా.. ఐదుకోట్ల ఆంధ్రుల దృష్టిలో నేరగాడిగా నిలబెట్టడంలో చంద్రబాబు విజయవంతం అయ్యారు. చంద్రబాబు ఎంతగా విమర్శించినా మోడీ నుంచి కానీ, అమిత్ షా నుంచి కానీ కనీస స్థాయిలో కూడా కౌంటర్లు లేవు. స్థానిక నాయకులు సోము వీర్రాజు లాంటి వారు ఎంత గొంతు చించుకున్నా పక్కింటివారు కూడా పట్టించుకోరు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏవో పసలేని విమర్శలు చేస్తుంటారు కానీ, అవి మనసులోంచి వచ్చినట్లు కనిపించవు.

ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సంధర్భంగా ఓ ఇంటర్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్‌లు ఇచ్చారు. చంద్రబాబు ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారని.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమి పేరుతో తమను తాము కాపాడుకునేందుకు ఒకరి వైపు మరొకరు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. వీరి కలయిక ఓ గేమ్, దేశానికి ఏదన్నా మంచి పని చేయాలన్నది వీరి అజెండా కాదని, వీరి అజెండా ‘మోదీ’ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో కూటమికట్టిన చంద్రబాబుకు ఘోరపరాజయం ఎదురైందని, ఆ రాష్ట్రంలో కూటమికి దారుణ పరిస్థితి ఎదురైందని, కూటమి పేరుతో బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసినంత మాత్రాన ఓటర్లు కలవరని తేలిపోయిందని అన్నారు.

అయితే చంద్రబాబుపై మోదీ విమర్శలు చేయగానే చంద్రబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌తో కలిశామని చేతకాని నిర్వాకంతో దేశాన్ని మోడీ శిథిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహాకూటమి విఫలమయిందని… మోడీ గొప్పగా చెప్పడాన్ని… చంద్రబాబు ఖండించారు. తెలంగాణలో కేసీఆర్‌ గెలిస్తే మోదీకి ఎందుకు సంబరమని ప్రశ్నించారు. వాస్తవాలను జనం గమనిస్తున్నారని అన్నారు. ఈ సంధర్భంగా ఓ సవాల్‌ను కూడా చంద్రబాబు మోదీకి విసిరారు. తాను కేవలం లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రానికి సీఎంనని సర్వశక్తిమంతుడ్ని అంటున్న ప్రధాని..నాతో చర్చకు రాగలరా? అని సవాల్ చేశారు. ఎవరి అభివృద్ధి విధానమేంటో దేశం ముందు ఉంచుదామంటూ సవాల్ విసిరారు.

కేసీఆర్ సన్నాసి, గాడు అని తిట్టినా మోడీకి బాధ లేదని.. రాష్ట్రం కోసం మేం నిలదీస్తే తప్పుబడతారా? అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్న విషయం తనకు తెలియదని మోడీ చెప్పుకు రావడాన్ని ఖండించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ కు సూత్రధారులు మోడీయేనంటూ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్‌లో మమతాబెనర్జీ ఉన్నారంటూ జైట్లీ ఎలా ప్రకటించారని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని దాన్ని ప్రమోట్‌ చేస్తోంది. మోదీ, జైట్లీనేనని తేల్చేశారు. మహాకూటమి విఫలం కాలేదని.. విఫలమైంది ప్రధాని మోదీయేనని అన్నారు.

వాస్తవానికి వైఫల్యాలను విజయాలుగా ప్రచారం చేసుకోవడంలో నరేంద్రమోదీ స్టైలే వేరు. జీఎస్టీ, నోట్లరద్దు, బడాబాబుల పరారీ.. అన్నీ తాము సాధించుకున్న విజయాలే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మహాకూటమి ఫెయిలందని తీర్పిచ్చారు. మూడు రాష్ట్రాల్లో పరజయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత వల్లేనని తేల్చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ఫలితాలు సహజమేనని వ్యాఖ్యానించారు. గెలుపు, ఓటమి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబు సవాల్‌ను మాత్రం మోదీనే కాదు.. బీజేపీలో ఎవరూ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. ఓపెన్‌ డిస్కషన్‌ అంటే ఈ నాలుగున్నరేళ్లో కేంద్రం సాయం లేకున్నా ఎన్నో కంపెనీలను చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో కూడా కేంద్రాన్ని ఎదిరించి పనులు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా.. రైల్వే జోన్.. ఏమీ ఇవ్వని బీజేపీ బహిరంగ చర్చకు రావడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

మరోవైపు జాతీయవ్యాప్తంగా కూడా.. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం ఏమిటో.. ఇప్పటి వరకూ సరిగ్గా చెప్పలేకపోయిన మోదీ.. ఇంటర్యూలో మాత్రం ఓ కొత్త అంశాన్ని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు లాంటి చర్యలతో స్వచ్ఛమైన, స్పష్టమైన విధానం తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు పారదర్శకంగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. మరి నల్లధనం, క్యాష్ లెష్ లక్ష్యాలు ఏమయ్యాయో మాత్రం వదిలేశారు. కొత్తగా రైలు పట్టాలు వేస్తున్నప్పుడు కొంతకాలం ఇబ్బంది ఉంటుందని .. వృద్ధిరేటుపై నోట్ల రద్దు ప్రభావం కూడా అంతేనని విచిత్రమైన ముగింపు ఇచ్చారు.

ఇక వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి బడబాబులు పారిపోవడంపై.. మోడీ అదీ తమ ఘనత అన్నట్లుగా చెప్పుకున్నారు. తమ హయాంలో అక్రమాలకు పాల్పడే అవకాశం లేక దేశం వదిలి పోరిపోయారంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే వారిని దేశానికి రప్పిస్తాం.. బాకీలు కట్టిస్తామని రొటీన్ డైలాగ్ మాత్రం యాజ్‌ఇట్ఈజ్‌గా చెప్పేశారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కట్టుబడి కోసం.. గతం చెప్పిన హామీలును మాత్రం ప్రస్తావించలేదు. మోదీ వచ్చిన నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ పనులు జరగలేదని.. చేసిన పనులేమైనా ఉంటే చెప్పాలని.. విపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఏం చేశారో మాత్రం వివరించలేదు.

ముందు చూపు లేకుండా జీఎస్టీని… దేశంపై రుద్దారనే విమర్శలను.. అన్ని పార్టీలపై.. ముఖ్యంగా కాంగ్రెస్ పై రుద్దే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే జీఎస్టీ రూపురేఖలు సిద్ధమయ్యాయని… జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు.. జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్‌ ఉందన్నారు. లోటుపాట్లకు కాంగ్రెస్‌ది బాధ్యతేనని… మోడీ ప్రతిపక్ష పార్టీపైకి తోసేశారు. రుణమాఫీ హామీ ఇవ్వబోవడం లేదని.. పరోక్షంగా చెప్పారు. రుణమాఫీ ఎప్పుడూ రైతులకు ఉపయోగపడలేదని అన్నారు. రుణమాఫీతో రైతుల జీవితాలు మారిపోతాయంటే సిద్ధమేనని దేవీలాల్‌ హయాం నుంచి రుణమాఫీ చేస్తున్నారు. కానీ రైతుల జీవితాల్లో ఎందుకు మార్పురాలేదని వ్యాఖ్యానించారు. పొలం నుంచి మార్కెట్‌ వరకు అన్ని స్థాయిల్లో మార్పు తెచ్చి రైతుల జీవితాలు బాగుపడేలా చేస్తానన్నారు.

ఇక దేశంలో మఖ్యమైన మరో అంశం “ముస్లింలపై దేశంలో వివక్ష” దీనిపై మాట్లాడుతూ దేశంలో అటువంటిది ఏమీ లేదని మోదీ స్వీయ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఏ వర్గంపైన కూడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు. భారత్‌లో హిందూ, ముస్లింల ఐక్యత చూసి అందరూ నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ఇస్లాంలో ఎక్కడా లేదుని… అందుకే చట్టం చేస్తున్నామని.. రాజకీయం చేయడం సరికాదన్నారు. రాఫెల్ విషయంలో.. తాను చెప్పాల్సిందేమీ లేదని..సుప్రీంకోర్టు తీర్పే చెప్పందని తప్పించుకున్నారు. ఇన్ని లొసుగులు బయటకు కనబడుతూ ఉంటే మోదీ కానీ.. బీజేపీ కానీ ఎలా చంద్రబాబు సవాల్ స్వీకరిస్తుంది అనేదే ఇప్పుడు చర్చిస్తున్న అసలు విషయం.

Share.

Comments are closed.

%d bloggers like this: