ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అసంబ్లీ ఎన్నికలు రానుండడంతో పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు.. సమీకరణాలతో ముందడుగు వేస్తున్నాయి. ఓ వైపు తెలుగు దేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని కోరుతుంటే పార్టీలో మాత్రం టిక్కెట్ల కోసం అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాలలో ఒకటైన తిరుపతిలో తెలుగు తమ్ముళ్ల మధ్య లుకలుకలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..
తిరుమలేశుని పాదాల చెంత వెలసిన తిరుపతి మహానగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి కేడర్ ఉంది. అయితే తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వం కార్యక్రమం ముమ్మరంగా చేపట్టాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు అన్ని జిల్లాల్లో దిశాదిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధినేత ఆదేశాలు… క్యాడర్ అంతా ఫాలో అవుతున్నారు. కానీ తిరుపతిలో మాత్రం నేతల తీరు.. పార్టీ అధినేతకు మింగుడు పడటం లేదు. తెలుగుదేశానికి మంచి పట్టున్న నియోజకవర్గం అయినప్పటికీ… స్థానిక ఎమ్మెల్యే తీరు.. మిగిలిన అగ్ర నాయకులకు మధ్యన సమన్వయం లోపించడంతో కేడర్ అంతా ప్రక్కదారి పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి నిదర్శనమే తిరుపతి నియోజకవర్గం టీడీపీ సభ్యత్వం విషయంలో వెనకుండడానికి కారణం అని అంటున్నారు.
తిరుపతిలో 2014లో జరిగిన ఎన్నికల్లో తిరపతి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి దివంగత వెంకటరమణ వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై 43 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు..అయితే ఎమ్మెల్యే వెంకటరమణ డిసెంబర్ 2015 డిసెంబర్ లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో 2016లో వచ్చిన ఉప ఎన్నికల్లో వెంకట రమణ సతీమణి సుగుణమ్మ లక్షా 20 వేల మెజార్టీతో మరో సారి టీడీపీ జెండా ఎగుర వేసింది..ఇంత వరకు బాగానే ఉన్నా తిరుపతి టీడీపీలో చాప కింద నీరులా అసంతృప్తులు..ఆధిపత్య పోరు విస్తరించినట్లు తెలుస్తుంది. ఆ ప్రభావం ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుపై చూపిస్తోంది. పార్టీ సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని అధినేత చంద్రబాబు వివిధ సందర్భాల్లో ఆదేశాలు జారీ చేసినా తిరుపతి నియోజకర్గ నేతల్లో మార్పు రాలేదు…
వాస్తవానికి టీడీపీ సభ్యత్వ నమోదులో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇదే చిత్తూరు జిల్లాకు చెందిన పీలేరు నియోజక వర్గం కూడా రెండో స్థానంలో నిలిచింది..అయితే సభ్యత్వ నమోదులో తిరుపతి నియోజకవర్గం మాత్రం చివరలో ఉంది. దీంతో సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకోవాలని చంద్రబాబు తిరుపతి ఎమ్మెల్యేతోపాటు ఇతర నేతలకు గట్టిగా చెప్పారు. అయితే అధినేత ఆదేశించినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. గతంతో ఇక్కడ 50వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేస్తే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది.. ఇప్పటి దాకా పార్టీ సభ్యత్వం కేవలం 15 వేలు మాత్రమే దాటిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవైపు పార్టీ సభ్యత్వ నమోదుకు గడువు ముగుస్తున్నా తిరుపతి నేతల్లో మాత్రం నిస్తేజం నెలకొంది. సభ్యత్వ నమోదు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీని కంతటీకీ కారణం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ.. ఎమ్మేల్యే అల్లుడు సంజయ్ వ్యవహర్తిస్తున్న తీరే కారణమని నియోజక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు…గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నా వెంకటరమణ అందరిని కలుపుకొని వెళ్లేవారిన చెబుతున్కనారు..కానీ ప్రస్తుతం తిరుపతిలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు… తిరుపతి పార్టీ వ్యవహారాలలో ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు అల్లుడు సంజయ్ వ్యవహరిస్తున్న తీరు ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ..పార్టీని ఎంతో కాలంగా నమ్ముకొని ఉంటున్న వారికి ఎలాంటి ప్రాధ్యానత్య ఇవ్వక పోవడంతో నగరంలోని అన్ని డివిజన్లలో సభత్వ నమోదు నత్తనడకన సాగుతుందని చెబుతున్నారు.. సీనియర్లను ఓన్ చేసుకోవడంలో ఎమ్మెల్యే సుగుణమ్మ విఫలం చెందారని చెబుతున్నారు.. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న డాక్టర్ శ్రీనివాసులుపై పార్టీ నేత అన్నా రామచంద్రయ్య వర్గీయులు దాడి చేయడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లినా దాడి చేసిన వారి దగ్గరికి వెళ్లి రాజీ చేసుకోమని ఎంత వరకు సమంజసమని వాపోతున్నారు..
సభత్వ నమోదు డివిజన్ల వారీగా చేయాలన్నా ఏ ముఖం పెట్టుకొని చేయాలని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. చాలా డివిజన్లలో సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు లేవని చెబుతున్నారు.. ఎమ్మెల్యే ఆమె అల్లుడు దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందన కరువైందని, ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో సభ్యత్వ నమోదుకు ఎలా వస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారని స్థానిక నేతలు వాపోతున్నారు. మరోవైపు మూడు పర్యాయాలు నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దంపూరు బాస్కర్ యాదవ్ కూడా నిస్తేజంగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అల్లుడు తీరుతో సీనిరయర్లు నీలం బాలాజీ.. డాక్టర్ సుధారాణి తుడా ఛైర్మన్ నరసింహయాదవ్… కోడూరు బాల సుబ్రమణ్యం..బుల్లేట్ రమణ తదితర నేతలు దూరంగా ఉంటున్నారు.. సభ్యత్వ నమోదులో కూడా వూకా విజయకుమార్ వంటి సీనియర్లకు ప్రాధ్యాన్యత ఇచ్చి కలుపుకోని పోవడం లేదని చెబుతున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసి ఆస్తులు కూడా అమ్ముకున్న వారిని పక్కకు పెట్టడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చాలామంది సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వంపై డివిజన్లవారగా సమావేశం పెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ముఖ్యనేతలు ఇలా వ్యహరిస్తుండటంతో భవిష్యత్తులో తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుందని తిరుపతి టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధినేత తిరుపతి నియోజకవర్గంపైన… పార్టీ పరిస్థితులపై దృష్టి సారించాలని పార్టీ నేతలు సీనియర్ నేతలు కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికలలో భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు