స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక జనవరి 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో పర్యటనకు కేంద్రం అనుమతి కోరిన సీఎం కార్యాలయం ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఆ సదస్సుకు తరలివస్తారు. బస్సులపై “సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్” అనే స్లోగన్‌తో పబ్లిసిటీ దౌత్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తప్ప నిరాకరించడం జరగదు కక్ష పూరితంగా చేస్తున్నారంటూ ఆగ్రహం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు చంద్రబాబు వెళ్తుంటారు. అక్కడ వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అవకాశంగా వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించింది. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆంక్షలు విధించడం దేనికి..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం రాజకీయంగా కలకలం రేపింది. ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న రాష్టం-కేంద్రం మధ్య సంబంధాలు తాజా ఘటనతో మరింత రాజుకున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొనేందుకు చంద్రబాబు ఏటా 14-15 మంది ప్రతినిధులతో కలిసి చంద్రబాబు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది.
పదిహేను మందితో వెళ్లాలనుకున్న చంద్రబాబుకు తొలుత కేంద్రం షాక్ ఇచ్చింది. అయితే ఏడు రోజుల పర్యటనకు అనుమతి ఇవ్వడం కుదరదని.. నాలుగు రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది. 15మందికి బదులు ఐదుగురితోనే వెళ్లాలని ఆంక్షలు విధించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు.. ప్రతి ఏడాది దావోస్‌లో జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఆ సదస్సుకు తరలివస్తారు. అందుకే చంద్రబాబు ప్రతీ ఏడాది ఓ పదిహేను మంది బృందంతో అక్కడికి వెళ్తారు. ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ స్టాల్ కూడా ఏర్పాటు చేసి.. వీలైతే.. బస్సులపై “సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్” అనే స్లోగన్‌తో పబ్లిసిటీ కూడా చేసుకుంటారు. వీలైనంత వరకూ.. అక్కడ ఏపీలో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూంటారు. ఈ ఏడాది కూడా జనవరి ఇరవై నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగబోతోంది. దానికి ఎప్పట్లానే పదిహేను మందితో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ ఢిల్లీ అడ్డుపుల్ల వేసింది.
సాధారణం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అధికారిక పర్యటనకు వెళ్లాలంటే.. ముందుగా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపి పర్మిషన్ తీసుకోవాలి. అయితే అది లాంఛనమే. దౌత్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తప్ప ఏ ముఖ్యమంత్రి అయినా విదేశీ పర్యటనకు వెళ్లదల్చుకుంటే అడ్డు చెప్పడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. కానీ మొదటి సారిగా ఏపీ ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లేందుకు సిద్ధమైన డెలిగేషన్ పై ఆంక్షలు విధించారు. పదిహేను మంది అవసరం లేదు.. ఐదుగురు చాలు అంటూ.. ఏపీ ప్రభుత్వం పంపిన అనుమతి లేఖను తిప్పి పంపారు.
అయితే ఎంతమంది వెళ్లాలో చెప్పేందుకు కేంద్రం ఎవరంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భగ్గుమంది. కేంద్రానికి ఘాటుగా తిరిగి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌పై కసితోనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే విమర్శలు రావడానికి కేంద్రమే ఆస్కారం ఇస్తోంది. ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించటంతో చంద్రబాబు చేతికి కేంద్రం మరో అస్త్రం ఇచ్చినట్లుగా అయింది. అదే విధంగా ప్రధానంగా ఏపికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంటే కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించడం ఏంటంటూ మండిపడుతున్నారు.
అయితే చంద్రబాబు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చుకుంటున్నాడనేది ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉంది. అందుకే దానికి అడ్డు కట్ట వేయాలంటే ఇటువంటి కార్యక్రమాలకు ఆటంకం కలిగించాలని భావిస్తుందనేది అసలు వాదన. గత నాలుగేళ్లలో చంద్రబాబు దావోస్‌కు… ఇంత కంటే పెద్ద బృందాలతోనే వెళ్లారు. అప్పుడు కేంద్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండానే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీతో కటిఫ్ చెప్పిన తర్వాత మాత్రం.. ఐదుగురు చాలంటూ నిబంధనలు పెడుతోంది. అందువల్ల ప్రజల్లో బీజేపీపై సందేహాలు పెరుగుతున్నాయి. టీడీపీ నేతల ఆరోపణలకు కారణం అవుతోంది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర వ్యతిరేఖతను వ్యక్తం చేయడంతో కేంద్రం దిగి వచ్చింది. చంద్రబాబుతో పాటు 17 మంది బృందం వారం రోజుల పాటు దావోస్‌లో పర్యటించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.