శతాబ్దాల సంప్రదాయం సరికాదన్న సుప్రీంకోర్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కనపెట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టారు. కేరళకు చెందిన ఇద్దరు మహిళలు నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి పోలీసు రక్షణతో ఆలయంలో అయ్యప్పను దర్శించుకున్నారు. అయితే వాళ్లు శబరిమల ఆలయంలోకి వెళ్లడం ఇప్పుడు కేరళలో రాజకీయంగా ఆందోళనలకు దారి తీసింది.

అయ్యప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్నారంటూ.. బయటకు వచ్చిన వీడియో అగ్గి రాజేసింది. కేరళ మొత్తం ఈ వీడియో బయటకు రావడంతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. రాజకీయ అవసరం కోసం కాచుకు కూర్చున్న పార్టీలు తమ శాయశక్తులా కేరళ ఇమేజ్‌ను దెబ్బ తీసి తమ రాజకీయ పార్టీల ఇమేజ్‌ను.. పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆస్తులు, వారి జీవితాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ సమాన హక్కుల పేరిట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాదాపుగా అందరూ స్వాగతించారు. చివరికి ఆరెస్సెస్ కూడా. గతంలో శనిసింగనాపూర్ లాంటి ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేకపోతే.. ఆరెస్సెస్ లాంటి సంస్థలే కోర్టుకెళ్లి ప్రవేశం ఇప్పించారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ సమాన హక్కుల పేరిట.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాదాపుగా అందరూ స్వాగతించారు. అయితే కేరళలో ఉనికి కోసం తంటాలు పడుతున్న బీజేపీ ఇప్పుడు అయ్యప్ప స్వామిని ఆయుధంగా వాడుకుంటుంది. బీజేపీకి సంప్రదాయాల పట్ల.. అంత నమ్మకం ఉంటే ఒక్క ఆర్డినెన్స్ ఇస్తే సమస్య పరిష్కారం అయ్యేది. ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కానీ.. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయినా సరే.. రాజకీయం చేయడమే బీజేపీకి కావాలి కాబట్టి.. ఈ వివాదం రగిలిస్తుంది.

వాస్తవానికి హిందూ దేవాలయాలను ఆగమ శాస్త్రం అనుసరించి నిర్మిస్తారు. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. అవి శైవాగమము, వైష్ణవాగమము, శాక్త్యాగమము. ఎన్నో వందల ఆగమ శాస్త్రాలు ఉన్నా దాదాపు అవన్నీ ఈ మూడింటిలో ఎదో ఒకదాని పరిధిలోకే వస్తాయి. దేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతీ చిన్న అంశం ఆగమశాస్త్రాలలో ఉంటుంది. ఎటువంటి భూమిని ఎంచుకోవాలి, ఎటువంటి శిలలు వాడాలి, గర్భాలయం ఏ దిక్కున ఉండాలి, ఉపాలయాలు ఎక్కడ ఉండాలి, ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి లాంటి అన్ని అంశాలూ ఆగమశాస్త్రంలో ఉంటాయి. ఇది చాలా లోతైన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్లు శిలలలో కూడా రకాలని గుర్తించగలరు. శిలలలో స్త్రీ, పురుష, నపుంసక అనే మూడు రకాలు ఉంటాయి. స్త్రీ దేవతా విగ్రహాల తయారీకి స్త్రీ శిలలు, పురుష దేవతా విగ్రహాల కొరకు పుం శిలలు, ఇతర నిర్మాణాల కొరకు నపుంసక శిలలు ఉపయోగిస్తారు. ఇవి మాత్రమె కాక, ప్రాణ ప్రతిష్ట ఏ విధంగా చెయ్యాలి, ప్రతిష్ట అయ్యాక ఎటువంటి నివేదనలు చెయ్యాలి, ఏఏ సమయంలో చెయ్యాలి, ఎంత పదార్ధం నివేదన చెయ్యాలి, ఎటువంటి అలంకారాలు ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఏ ఉత్సవాలు ఎప్పుడు, ఎలా చెయ్యాలి అనే అన్ని అంశాలూ ఆగమశాస్త్రమే నిర్ధారిస్తుంది. అందుకే రుతుక్రమం అవుతున్న స్త్రీలు శబరిమల వెళ్ళకూడదు అనే నియమం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉంది.

శబరిమల స్థల పురాణం ప్రకారం, అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి, శబరిమలలో జరిగిన ప్రతిష్ట, బ్రహ్మచారి ప్రతిష్ట. అటువంటి ప్రతిష్ట చేయ్యమని అయ్యప్పే చెప్పాడు అని స్థల పురాణం చెప్తోంది. ఇటువంటి ప్రతిష్ట జరిగిన ఆలయంలోకి నెలసరి అవుతున్న స్త్రీలు ప్రవేశించకూడదు అనేది ఆగమ శాస్త్ర నియమం. ఏ ఆగమశాస్త్రమైతే దేవాలయంలో దైవ శక్తి నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తుందో అదే ఆగమ శాస్త్రం కొన్ని నియమాలని కూడా పాటించాలి అని చెప్తోంది. దేవాలయంలో దైవ శక్తీ ఉంది అనేది నమ్మితే, నియమాలను కూడా నమ్మాలి. నియమాలపై నమ్మకం లేకపోవడం అంటే, ఆగమశాస్త్రంపై, ఆ శాస్త్ర ఆధారంతో నడుస్తున్న దేవాలయ వ్యవస్థపై నమ్మకం లేనట్లే. దేవాలయంలో దైవ శక్తీ ఉంది అని నమ్ముతాను కానీ, నియమ నిబంధనలని మాత్రం నమ్మను అనడం ఆత్మవంచనే అవుతుంది. నేను వైద్య శాస్త్రాన్ని నమ్ముతాను కానీ, ఆ శాస్త్రం చెప్పిన పత్యాన్ని మాత్రం నమ్మను అనడం లాంటిదే ఇది కూడా.

అయితే సంప్రదాయాలకు చట్టాలు వర్తిస్తాయని.. సుప్రీంకోర్టు ఎలా అనుకుందో కానీ శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్లవచ్చని అందరికీ సమానత్వం ఉందని తీర్పు ఇచ్చింది. కానీ అది భక్తుల విశ్వాసం. అక్కడ అధికారికంగా ఎలాంటి నిషేధం లేదు. రుతుక్రమంలో ఉన్న యాభై ఏళ్లలోపు మహిళల్ని అనుమతించరు. అనుమతించరు అనే దాని కన్నా వెళ్లరు అని చెప్పడం కరెక్ట్. అయ్యప్పపై విశ్వాసం ఉన్న వాళ్లే.. ఆలయానికి వెళ్తారు. ఆ విశ్వాసం ఉన్న వాళ్లెవరూ సంప్రదాయాలను అధిగమించరు. అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అయ్యప్పపై నమ్మకం లేకపోయినా గుళ్లోకి వెళ్లడాన్ని తమ జన్మహక్కుగా భావించిన ఇద్దరు మహిళలు వెళ్లడం వల్ల కేరళ రాజుకుంటుంది. వారే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు. వాటికి రాజకీయాలు ఆజ్యం పోస్తున్నాయి. స్త్రీల శబరిమలగా పిలువబడే అట్టుక్కుల్ అమ్మన్ దేవాలయంలో జరిగే పొంగలం పండుగ దినాలలో పురుషులకి ప్రవేశం ఉండదు. ఇది పురుషుల పట్ల వివక్ష అంటే ఎలా? అదీ కాక దేశంలో ఎన్నో వేల అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడా ఇటువంటి నిబంధన లేదు. కాబట్టి శబరిమలలో ఉన్న నియమాన్ని స్త్రీల పట్ల వివక్ష అనుకోవడం చాలా పొరపాటు.. మన దేశంలో ఎన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇటువంటి నియమాలు వేరెక్కడా లేవు. కాబట్టి హిందూ దేవాలయాలలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ రాజకీయాలకు ఇదొక్క పాయింటే ఉపయోగపడుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: