మెగా.. నందమూరి అభిమానుల మధ్య వైరం

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎప్పుడూ దగ్గర సంబంధాలు ఉంటూనే ఉంటాయి. అయితే రాజకీయంగా ఎంత తిట్టుకున్నా విమర్శించుకున్నా కూడా సినిమాలలో మాత్రం కలిసి చేయడం ఫంక్షన్‌లలో పాల్గొనడం చేస్తూనే ఉంటారు సినిమావాళ్లు. అయితే ఇటీవల బాలకృష్ణ అభిమానులకు, చిరంజీవి తమ్ముడు నాగబాబులకు మధ్య రాజుకున్న సెగ రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. అయితే నాగబాబు వ్యాఖ్యలుపై రకరకాల ఊహాగానాలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చిరంజీవి తమ్ముడు, పవన్ కల్యాణ్ అన్న నాగేంద్రబాబు.. అలియాస్ నాగబాబు వరుసగా బాలకృష్ణను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వతా బాలకృష్ణ అనే పాతతరం కమెడియన్ ఫోటో చూపించి ఓ సారి.. ఆ తర్వాత కొన్ని జంతవుల ఫోటోలు పెట్టి ఓ సారి.. అలాగే బయోపిక్‌పై… ఓ కవిత రాసి… బాలకృష్ణపై తన కోపాన్నంతా చూపిస్తున్నారు. నాగేంద్రబాబు హఠాత్తుగా ఎందుకు బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పట్టించుకున్న వాళ్లు పట్టించుకున్నారు.. లేని వాళ్లు లేదు. అయితే పొలిటికల్‌గా మాత్రం తెలుగుదేశంకు.. జనసేనకు మధ్య ఈ మాటలు హీట్‌ను పెంచుతున్నాయి. నాగబాబు వ్యాఖ్యలు మెగా.. నందమూరి అభిమానుల మధ్య వైరం పెంచింది.

వాస్తవానికి బాలకృష్ణ పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని.. ఇటీవలి కాలంలో అనలేదు. అది జరిగి చాలా రోజులు అయింది. అది కూడా రాజకాయపరమైన వ్యాఖ్యల్లో. అప్పుడే సందర్భంలో అన్నారో కానీ ఎప్పుడో అన్న మాటల్ని ఇప్పుడు బయటకు తీసుకువస్తుంది మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్తున్నారు. నిజంగా.. బాలకృష్ణ మాట మనసుల్ని బాధపెట్టి ఉంటే.. అప్పుడే ఎందుకు రియాక్ట్ అవలేదు. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులను రెచ్చగొట్టే వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. ఏపీ రాజకీయాలు కులాల ప్రకారం విడిపోయి.. ఓ రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తరుణంలో నాగబాబు ఎప్పుడో మాట్లాడిన మాటలను బయటకు తెచ్చి ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయం లేదని ఎలా అనుకుంటారు.

రాజకీయంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుపై, లోకేష్‌పై చేస్తున్న విమర్శలు.. తెలుగుదేశం నేతలు పవన్‌పై చేస్తున్న విమర్శలు నాగబాబు వినడం లేదా..? అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఇంపుగా ఉన్నాయా ..?. అన్నీ రాజకీయాల్లో భాగంగా.. రాజకీయంగా ఎంతైనా విమర్శించుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యక్తిగతంగా కించ పరిచే హక్కు ఉందా అంటే ఉంది.. లేదా అంటే లేదు.. అది నైతికతకు సంబంధించిన విషయం. అయితే బాలకృష్ణను తాను టార్గెట్ చేయలేదని.. మీరే అలా అనుకున్నారంటూ… బాలకృష్ణ ఆరేడు నెలల కిందట.. పవన్‌పై మాట్లాడారని, అందుకే తాను ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నానని అన్నట్లుగా నాగబాబు కంక్లూజన్ ఇచ్చారు. “మీరు చెయ్యేచ్చు.. మేమూ చేయకూడదా..?” అంటూ చెప్పుకొచ్చారు. అంటే.. బాలకృష్ణనే అన్నాను అని కన్ఫర్మ్ చేస్తూనే… మొదట్లో ఆ మాట అంగీకరించడానికి కూడా.. వెనుకాడరు. ధైర్యంగా బాలకృష్ణనే అన్నానని చెప్పడానికి సంకోచించడం ఎందుకు..? ఆయన అన్నాడు కాబట్టి.. తాను అన్నానని చెప్తే ఇబ్బంది ఏంటి..? బాలకృష్ణపై పదే పదే కామెంట్లు చేస్తున్నారు నాగబాబు.

బాలయ్య తరుచు మాట్లాడే మాటలైన బ్లడ్డు.. బ్రీడ్ గురించి కూడా.. నాగబాబు మాట్లాడారు. ఓ దున్నపోతు ఫోటో, ఓ కుక్క బొమ్మ పెట్టి వీటి బ్లడ్, బ్రీడు చాలా స్పెషల్.. అంటూ బాలయ్యను కవ్వించే ప్రయత్నం చేసాడు. ఇలా వరుసగా బాలయ్య మీద నాగబాబు పరోక్ష కామెంట్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనే విషయంపై ఇప్పుడు పొలిటికల్ సెక్టార్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికలకు వెళ్ళినప్పటికంటే… ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్తున్న సమయంలో నాగబాబు మరింత యాక్టివ్ కావాలని తపిస్తున్నట్లుగా చెప్తున్నారు. నాగబాబుకు ప్రస్తుత సమయంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా బాగా ఎక్కువగా ఉందట.

టీవీ షోల ద్వారా తనకు ఉన్న పరిచయాలను బాగా ఉపయోగించుకుని తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకున్న నాగబాబు వారిని ప్రచారంలో వాడుకుంటూ, తమ్ముడు పవన్ పట్ల ఉన్న క్రేజ్‌తో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నట్టు చెప్తున్నారు. జనసేన నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకోవాలని ఉర్రులుగుతున్నాడు. పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ కామెంట్లు పెంచారని చెప్తున్నారు. దేనిలో భాగంగానే ఇప్పటి నుంచే బాలయ్యను టార్గెట్ చేసుకుంటూ తన బలం పెంచుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయంలో జనసేన అధినేత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, అందుకే నాగబాబు బ్రేకుల్లేని బండిలా దూకుడుగా వెళ్తున్నట్టు చెప్తున్నారు. అందులో భాగంగా ఇటీవల జనసేనకు భారీగా విరాళం అందించినట్లు చెప్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: