వైసీపీకి మాత్రం గట్టి షాక్ !

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అలాగే టిక్కెట్ రాని నేతలు వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీలో కీలకంగా ఉన్న ఓ నేత పార్టీ వీడేందుకు సిద్దమయ్యాడు. అయితే ఆయన పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇంతీకీ ఆ నేత ఎవరు? ఆయనకు వైసీపీలో వచ్చిన ఇబ్బంది ఏంటి?.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారడం మామూలే.. అయితే వైసీపీకి మాత్రం గట్టి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. హీరో కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు, జగన్‌కు సన్నిహితంగా మెలిగిన ఈయన పార్టీని వీడుతుండడంతో వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఆయన గుంటూరు లోకసభ స్థానం అడిగితే, జగన్ విజయవాడ లోకసభ స్థానం ఇచ్చేందుకు మొగ్గు చూపడం వల్లే ఆయన పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు చెప్తున్నారు.

వాస్తవానికి జగన్ ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిపోతే పెద్దగా పట్టించుకోరు అంటారు. అయితే ఆదిశేషగిరిరావు విషయంలో మాత్రం జగన్ ఆయనను వదులుకునేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తుంది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులంతా వైసీపీకి మద్దతివ్వాలని బహిరంగ ప్రకటన చేసిన ఆదిశేషగిరిరావు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన పార్టీ మారితే ఘట్టమనేని అభిమానులు సైతం జగన్‌కు దూరంగా ఉండే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బావ గల్లా జయదేవ్ తెలుగుదేశంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు సపోర్ట్ చేయమంటూ అభిమానులను మహేష్ కోరిన సంగతి తెలిసిందే.

కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తనకు చెందిన భూమిని మంగ‌ళ‌గిరి స‌మీపంలో వైసీపీ కార్యాలయానికి ఇచ్చివేసి.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడడమే తన ధ్యేయమని ప్రకటించారు. అంతేకాదు, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి ప్ర‌చారం చేయాల‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వ‌చ్చినా ఆయ‌న స్పందించ‌లేదు. మ‌రి ఇలా వైసీపీకి అంకిత భావంతో ప‌నిచేస్తూ.. ఆస్తుల‌ను సైతం రాసిచ్చిన ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు పార్టీని వీడడం పట్ల స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: