వైసీపీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చినట్లేనా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహించే దర్శి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విషయంపై ఒక క్లారిటీ ఏర్పడింది. వివిధ కారణాలతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు పోటీకి సిద్దమంటూ ఓ వ్యాపారవేత్త రంగంలోకి దిగారు.

దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంపై ఒక స్పష్టత ఏర్పడింది. తాను పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఆపార్టీ అధినేత జగన్‌ను కలిసి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రంగంలోకి రావాలని జగన్‌ ఆయనకు సూచించగా సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్‌ బదులిచ్చినట్లు తెలుస్తుంది. 2009ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే జగన్‌ నిర్ణయించుకున్నారు.

ఆవిషయాన్ని ఒంగోలు లోక్‌ సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా వేణుగోపాల్‌కు తెలిపారు. అయితే కొంత వ్యవధి అడిగిన వేణుగోపాల్‌ చెప్పిన సమయం ప్రకారం తన సోదరుడు, ఒంగోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు శ్రీధర్‌తో కలిసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లారు. తొలుత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన ఆయన ఆతర్వాత జగన్‌ను కలిశారు. వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు జగన్‌ సూచించగా అందుకు వేణు గోపాల్‌ అంగీకారం తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా అరంగేట్రం చేస్తానని చెప్పినట్లు తెలిసింది. సమయం తక్కువ ఉన్నందున మరోసారి వాయిదా వేయవద్దని జగన్‌ ఆయనకు సూటిగా చెప్పినట్లు సమాచారం. అయితే ముందుగానే అన్ని విషయాలను స్పష్టంగా చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి అవసరమైన సూచనలు చేసినట్లు చెప్తున్నారు.

వైసీపీ దర్శి బాధ్యతలు చేపట్టేందుకు వేణు గోపాల్‌ సన్నద్ధం కావడంతో నియోజకవర్గంలోని అభిమానులు, వైసీపీకి చెందిన మరికొందరు నాయకులు ఆయనకు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు. జగన్‌తో వేణుగోపాల్‌ భేటీ పార్టీపరంగా కీలక పరిణామంగా భావిస్తుండగా ఆ సమయంలో జిల్లా కు చెందిన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డికానీ ఆ సమయంలో అక్కడ లేకపోడం చర్చనీయాంశమైంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుందన్నది అర్థంకావట్లేదు. గతంలో పార్టీ సమన్వయకర్తగా నియమితులైన బాదం మాధవరెడ్డిని బూచేపల్లి వ్యతిరేకించారు. వేణుగోపాల్‌ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారనేది తెలియవలసి ఉంది.

అయితే వేణుగోపాల్ చేరికతో దర్శి మాదేనంటూ.. వైకాపా నేతలు నమ్మకంగా ఉన్నప్పటికీ.. శిద్దా చేసిన అభివృద్ధి ఆయనకు శ్రీరామ రక్ష అని ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా శిద్దా అభివృద్ధే ఆయనను గేలిపిస్తుందంటూ తెదేపా శ్రేణులు నమ్మకం ఉన్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: