Advertisements

పాదయాత్రతో జగన్ సాధించిందేంటి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. సంకల్పమే ఆయుధంగా.. 341రోజులు.. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వ‌ర‌కు.. 3641 కిలో మీట‌ర్ల సుధీర్ఘ పాదయాత్ర.. నేటితో ముగిసింది. అన్న వస్తున్నాడు స్లోగన్‌తో జగన్ సాగించిన పాదయాత్రతో జగన్ అనుకున్న లక్ష్యం దగ్గరైందా..? లేక దూరమైందా..? పాదయాత్రతో జగన్ సాధించిందేంటి?


341 రోజులు.. 3వేల 648కిలోమీటర్లు, 134నియోజకవర్గాలు.. అంకెల్లో చెప్పాలంటే.. జగన్ పాదయాత్ర ఇదే. కోర్టుకు వెళ్లేందుకు.. పండుగలు, సెలవులు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆయన నడవని రోజులను తీసేస్తే.. ఈ పధ్నాలుగు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి 341 రోజుల పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జరిగిన పాదయాత్ర నేటితో ముగిసింది. ఈ సమయంలో పాదయాత్రలో జగన్ సాధించిందేమిటన్న చర్చ మాత్రం… రాజకీయ వర్గాల్లో సహజంగానే వస్తుంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ప్రధాన ఉద్దేశ్యం.. లక్ష్యం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి అవ్వడం కోసమే. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు పాదయాత్రల ద్వారానే ప్రజలలోకి వెళ్లి ముఖ్యమంత్రులు అయ్యారని అంటారు. అయితే అదంతా సెంటిమెంటు మాత్రమే అని చెప్పుకోవచ్చు. వైఎస్ పాదయాత్ర చేశారు. కానీ ఆ పాదయాత్ర ద్వారానే సీఎం అయ్యారని చెప్పలేం. అప్పటికే తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉండటం వైఎస్‌కు ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచనతో ప్రజలు అప్పట్లో కాంగ్రెస్‌ను గెలిపించారనే విశ్లేషణ ఉంది. ఇక చంద్రబాబు మూడో సారి ముఖ్యమంత్రి అవడంలో పాదయాత్ర పాత్రను ఎవరూ పెద్దగా గుర్తుంచుకోరు. చంద్రబాబు గెలుపునకు పాదయాత్ర కన్నా.. ప్రభావితం చేసిన కారణాలు వేరే ఉన్నాయి . అందుకే పాదయాత్ర గెలిపిస్తుందని కాదు కానీ.. జనంలో ఉన్నట్లు భావించడానికి మాత్రం ఉపయోగపడిందని భావించవచ్చు.

ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత ఉండి అది ప్రతిపక్షానికి కలసి రావాలంటే ఖచ్చితంగా కొన్ని బ్రాండెడ్ హామీలు ఉండాలి. అప్పటో వైఎస్ ప్రకటించిన ఉచిత్ విద్యుత్.. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వంటి హామీలు. అలాంటిది ఒక్కటైనా.. వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడా..? అంటే.. లేదనే చెప్పాలి. నవరత్నాలు పేరుతో ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి జనాకర్షక పథకాలు మాత్రమే బ్రాండ్ ఉన్న పథకం అయితే కాదు. ప్లీనరీలో తొమ్మిది ప్రధానమైన హామీలను జగన్ ప్రస్తావించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు సంవత్సరానికి 12వేల 500 రూపాయలు పెట్టుబడి కింద ఇవ్వడం, ఫీజు రియంబర్స్ మెంట్, ఏటా 20వేల రూపాయలు ఒక్కో విద్యార్ధికి అందించడం, ఫీజు ఎంతైతే అంత చెల్లించడం, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం కింద ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం, మధ్యపాన నిషేధం, అమ్మ ఒడి పదకం, వైఎస్సార్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ల పెంపు వంటి 9హామీలను ప్రకటించారు. వీటిలో ఒక్కటంటే.. ఒక్కటి బ్రాండెడ్‌గా మార్చుకోలేకపోయారు. ఒక్క హామీపైనా ప్రజల్లో చర్చ జరగలేదు. నిజానికి.. జగన్ ప్రకటించిన రైతు భరోసా లాంటి పథకం.. రైతు బంధును కేసీఆర్ ప్రవేశ పెట్టి భారీ విజయం సాధించారు. అయినప్పటికీ.. దీనిని కూడా ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకెళ్లలేకపోయారనే అభిప్రాయం ఉంది.

అయితే జగన్ పాదయత్ర వల్ల వైసీపీ నేతల్లో కాస్త నైతిక స్థైర్యం పెరిగిందనే చెప్పుకోవాలి. పాదయాత్ర ప్రారంభానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. అప్పటి నుంచి వైసీపీ ఎదురీదుతోందన్న ప్రచారం జరుగింది. దానిని కొంత మేర నిలువరించుకోగలిగారన్న అభిప్రాయం ఏర్పడింది. పాదయాత్ర చేస్తూ.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అంచనా వేసి.. ఎప్పటికప్పుడు.. నిర్ణయాలు తీసుకుని నియోజకవర్గాల ఇన్చార్జులను మార్చి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. జగన్ పాదయాత్ర ఆ పార్టీని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు, లీడర్లు, క్యాడర్లలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఉపయోగపడింది

ఇక పాదయాత్ర సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ అనుకున్నారు. ఆ ప్రకారం నిర్ణయం ప్రకటించేశారు. ఇది తీవ్ర విమర్శలకు కారణం అయింది. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రలు చేసిన సమయంలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి, తమ నేతల పాదయాత్రలో వచ్చిన సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి, వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేశారు. దీంతో జగన్ కు… ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలను కూడా పంపని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎలా ఆశపడతారన్న సెటైర్లు సహజంగానే ప్రజల నుంచి వస్తున్నాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానం ఇంకా.. జగన్ దగ్గర నుంచి రాలేదు. ఆయన వాదన మాత్రం ఆయన వినిపిస్తున్నారు. చూడాలి మరి జగన్‌కు పాదయాత్ర ఏ మేరకు సాయపడుతుందో?

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: