జనసేనాని కి పొత్తులులేవా !

Google+ Pinterest LinkedIn Tumblr +

   • లెఫ్ట్ పార్టీ నేతలు రామకృష్ణ, మధులు పొత్తులపై పవన్ కళ్యాణ్‌తో చర్చలు
    175 సీట్లకు గానూ మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్న కమ్యూనిస్టులు
 • అధికార తెలుగుదేశం.. ప్రతిపక్ష వైసీపీలతో కలిసి వెళ్లేది లేదని, వామపక్షాలతో కలిసి నడుస్తామని చెప్తున్న జనసేనాని దానికి అనుగుణంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పొత్తులు, సీట్లు ఖరారు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా జరిగిన భేటిలో ఏం జరిగింది.. వామపక్షాలు కోరే సీట్లు ఎన్నీ..? పవన్ నిర్ణయం ఏంటి?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాస్థాయి నేతలతో ఆయన ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. టిక్కెట్లు ఎవరికి ఇస్తారో చెప్పిన పవన్ కళ్యాణ్.. 60 శాతం కొత్త వారికి, 20 శాతం భావజాలం ఉన్నవారికి, 20 శాతం విలువలు ఉన్న వారికి టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లోనే మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని జనసేన ధీమాగా ఉంది. అలాగే కమ్యునిష్టులతో పొత్తులకు సంబంధించి కూడా కీలక నిర్ణాయాలు తీసుకుంటున్నారు.

  పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి వరకు రకరకాల చర్చలు, ఊహాగానాలు చెలరేగాయి. మొన్నటి వరకు జగన్‌ పార్టీతో జనసేన జతకట్టే అవకాశం ఉందంటూ సాగిన ప్రచారానికి పవన్‌ ఈ మధ్యనే తెరదించారు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించడంతో సందడి మొదలైంది. రెండేళ్లగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారంతా ఈ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు తమ దరఖాస్తులను పార్టీ కార్యాలయానికి పంపారు. పవన్‌తో భేటీకి తిప్పలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సమాంతరంగా మరో కసరత్తు ఆరంభించింది. జిల్లాల వారీగా పార్టీ బలాబలాలు, కలిసొచ్చే వర్గాలు, పోటీ చేసేందుకు అన్ని హంగులు కలిగిన అభ్యర్థులు, అంతకంటేమించి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే ఆర్థిక స్తోమత ఉన్న వారి అన్వేషణలో పడింది.

  ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా పొత్తులు, సీట్లు ఖరారు చేసుకుందామని లెఫ్ట్ పార్టీ నేతలతో నాదెండ్ల చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు పట్టు ఉన్న స్థానాల జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్‌కు వామపక్ష నేతలు అందించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వారు ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో చర్చలు ముగిసిన అనంతరం లెఫ్ట్ పార్టీ నేతలు రామకృష్ణ, మధులు మాట్లాడారు. పొత్తులపై ఆయనతో చర్చించామని తెలిపారు. సీట్ల కేటాయింపు పైన కూడా చర్చ జరిగిందని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి భేటీ అవుతామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే అంశం పైనా చర్చించినట్లు చెప్పారు.

  ఇదిలా ఉంటే మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లను అడుగుతున్నారట కమ్యూనిస్టులు. బహుశా గత కొన్ని దశాబ్దాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీతో పొత్తులతో వెళ్లినా ఇన్ని సీట్లు పోటీచేసిన చరిత్రలేదు. అయితే పవన్ కల్యాణ్‌ను తక్కువ అంచనా వేసి ఇలా అడుగుతన్నట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. 175 సీట్లకు గానూ మరీ 60 సీట్లను అడగటం అంటే.. కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత స్థితికిగానూ ఇది చాలా చాలా ఎక్కువ. ఏ టీడీపీతోనో, వైసీపీతోనో పొత్తుకు వెళ్లి ఉంటే వారికి పది కూడా దక్కే అవకాశం లేదు. ఇక ఏడెనిమిది ఎంపీ టికెట్లు కూడా అడుగే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టులకు అరవై సీట్లనూ అప్పగిస్తే.. ఆయన తన పార్టీని చాలా తక్కువ చేసుకున్నట్టే. ఇటువంటి పరిస్థితిలో ఈ సీట్ల డీల్ ఎక్కడికి తెగుతుందో చూడాలి!

  Share.

  Comments are closed.

  %d bloggers like this: