ఓ ముఖ్యమైన నేత టీడీపీ గూటికి!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం మామూలే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పార్టీలు మారే సీజనే నడుస్తుంది. తాజాగా రాయలసీమలో ఓ ముఖ్యమైన నేత తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. కర్నూల్ జిల్లా రాజకీయాలలో బలమైన నేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత ఇప్పుడు తెలుగుదేశం కండువా కప్పుకోబోతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుంటే కీలక నాయకులు ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని తపన పడుతున్నారు. ఇక అలాంటి నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాలులోచక్రం తిప్పగల కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో చేరటానికి సిద్దం అయ్యారు. ఏపీలో గత ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాలను విభజించి కాంగ్రెస్ ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు లేవు. ఇక ఏపీలో టీడీపీ కాంగ్రెస్ లు పొత్తులతో పోటీ చేస్తాయా అంటే అది కూడా క్లారిటీ లేదు. తెలంగాణలో పొత్తుల ఎఫెక్ట్ తోనే ప్రజాకూటమి ఓటమి పాలైంది అని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఏపీలో ఇంకా ఏ విషయం తేల్చుకోలేదు. పొత్తులతో పోటీ చేస్తారా లేకా మద్దతుగా ఉంటారా అనేది తెలియకపోవటంతో కోట్ల ఇదంతా ఎందుకు టీడీపీలో చేరితే సరిపోతుందనే భావనకు వచ్చినట్లు తెలుస్తుంది.

మన్మోహన్ హయాంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ళుగా ఇదిగో అదిగో అంటున్న ఆయన ఎట్టకేలకు ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. చాలాకాలంగా ఆయన టీడీపీలో చేరుతారని వినిపిస్తున్నప్పటికీ అది ఆచరణలోకి జరగలేదు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన ఇప్పటికే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఇక పార్టీ విషయంలో క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఫైనల్‌గా ఆయన టీడీపీలో చేరి క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.

మరోవైపు కాంగ్రెస్, టీడీపీల పొత్తు విషయంలోనూ స్పష్టత ఇంకా రాకపోవడం కూడా ఆయన టీడీపీలో చేరాలనుకోవటానికి కారణం. స్థానికంగా మంచి పేరున్న నేత కావటంతో ఆయన రాకను టీడీపీ స్వాగతిస్తుంది. ఇక పార్టీ మారకుండా పొత్తులు సైతం లేకుండా కోట్ల అక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టే ఆయన సమయానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అదీ కాక ఆయన టీడీపీలో చేరితే ఓట్లు క‌లిసొస్తాయి. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్లకు సుమారు లక్ష ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తే అంతకన్నా ఎక్కువ వస్తాయన్న నమ్మకం లేదు.

అంతే కాకుండా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కూడా ఎంపీ అభ్యర్థిగా తనపైన పడుతుంది. ఇక టీడీపీ నుండి అయితే పార్టీనే ఖర్చు భరిస్తుంది అని కూడా ఆలోచించారట కోట్ల. ఇవన్నీ ఆలోచించే ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక కోట్ల చేరిక జరిగితే కర్నూలు పార్లమెంట్ స్థానం కోట్లకి ఇచ్చే అవకాశం వుంది. కాబట్టి బుట్టా రేణుక ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ఆమెకు టికెట్ ఇవ్వటానికి ఎక్కడా వెసులుబాటు లేకపోవటంతో ఆమె రాజకీయ భవిష్యత్‌పై టెన్షన్ పడుతుంది.

కర్నూలు జిల్లాలో బలమైన కోట్ల ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డితో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలోకి కోట్ల ఫ్యామిలీ రాకను వ్యతిరేకిస్తున్న కేఈ కృష్ణమూర్తిని కూడా చంద్రబాబు బుజ్జగించినట్లు తెలుస్తోంది. కోట్ల రాకతో జగన్‌ను బలహీన పర్చడమే కాకుండా, పార్టీని బలోపేతం చేయవచ్చని కేఈకి నచ్చజెప్పారట. కోట్ల ఫ్యామిలీ రాకతో ఎలాంటి ఇబ్బందులు మీకు ఉండవని కూడా కేఈకి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు చెప్తున్నారు. చూడాలిమరి కోట్ల చేరికతో ఏం జరుగుతుందో?

Share.

Comments are closed.

%d bloggers like this: