టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ఉదయం కుటంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిశారు. పార్టీలో చేరికపై వైసీపీ అధినేతతో చర్చించారు. త్వరలో ఒంగోలులో జరగనున్న వైసీపీ సమరశంఖారావం సభకు చీరాల నుంచి తన అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాలని ఆమంచి భావిస్తున్నారట. జగన్తో భేటీ అనంతరం అమంచి మాట్లాడుతూ..
తాను టీడీపీలో చేరినప్పటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులు.. జరిగిన అంశాలు బాధించాయన్నారు. అందుకే ఆ పార్టీలో ఉండలేక వైసీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చానన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై రోజుకో మాట మారుస్తున్నారని.. అనుభవం ఉందని ప్రజలు గెలిపిస్తే వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కులతత్వంలో కూరుకుపోయారు.. పార్టీ చంద్రబాబు చేతిలో ఉందా.. వేరే వ్యక్తుల చేతిలో ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. రోజుకో అబద్ధంతో రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. ఉదాహరణగా పసుపు-కుంకమ పేరుతో మహిళలకు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. 10ఏళ్లు హైదరాబాద్లో ఏపీకి హక్కు ఉన్నా పారిపోయి అమరావతికి వచ్చారన్నారు. సమాజపరంగా ఆలోచించి జగన్కు మద్దతు పలుకుతున్నానని.. రాష్ట్రానికి ఆయన తప్ప మరో ఆప్షన్ లేదన్నారు. తర్వలోనే మరికొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తారని అభిప్రాయపడ్డారు. బుధవారం ఉదయం టీడీపీకి రాజీనామా చేసిన అమంచి, ఆ లేఖను చంద్రబాబుకు పంపి.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సహా వెళ్లి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు.