రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోల లిస్టులో మహేశ్ బాబు కూడా చేరబోతున్నాడా ? అంటే దీనికి కొన్ని మీడియా సంస్థలు ఔననే సమాధానాలు ఇస్తున్నాయి. మహేశ్ బాబు నాన్న సూపర్ స్టార్ కృష్ణ..కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పనిచేశారు. అలాగే ఆయన సొంత బావ గల్ల జయదేవ్ తెలుగు దేశం తరుపున గుంటూరు లోక్ సభ సభ్యునిగా పనిచేస్తున్నారు. మరోవైపు మహేశ్ బాబాయి ఆదిశేషగిరి రావు ఎన్నో ఏళ్లుగా రాజకీయాలో కొనసాగుతూనే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ..తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈయన టీడీపీలో జాయిన్ కావడంతో మహేశ్ బాబు కూడా మనోడే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చింది.
‘రాష్ట్రానికి ఎంతో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నా భర్తకు చాలా గౌరవం ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ఉండటాన్ని చూసి ఆయన చాలా గర్విస్తుంటారు. చంద్రబాబు పక్కన మహేశ్ కనిపించినంత మాత్రాన… ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదు’ అని నమ్రత తెలిపారు.
టీడీపీ తరపున మహేశ్ ప్రచారం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా… అలాంటిదేమీ ఉండదని నమ్రత స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి మహేశ్ ప్రచారం చేయబోరని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికగానీ, రాజకీయపరమైన లక్ష్యాలు కానీ మహేశ్ కు లేవని తెలిపారు. ఆయన సమయమంతా సినిమాలకే సరిపోతోందని… కుటుంబంతో గడిపే సమయమే ఆయనకు ఫ్రీ టైమ్ అని చెప్పారు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా మహేశ్ బయటకు వెళ్లరని తెలిపారు.