మాజీ కేంద్ర మంత్రి టిడిపి సేనియర్ నేత అశోక్ గజపతి రాజు ఎందుకు ఎక్కువగా కనపడట్లేదు. చంద్రబాబు టూర్లలో మీటింగ్ లలో తన ఉనికి ఎందుకు కనబరువట్లేదు. ఎప్పుడూ మహానాడుని ముందుండి నడిపే మాజీ మంత్రి మహానాడుకి ఎందుకు హాజరవ్వలేదు.. గురువారం భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంతోపాటు శనివారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన టిడిపి పార్టీ పై అలిగారా..? లేదా ఆయన ప్రాభవం తగ్గిందని టీడీపీ అధిష్టానం భావించి ఆయనని పక్కన పెడుతుందా.. అనే ప్రశ్నలు గత కొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి.
ఆయనని ఈ ప్రశ్నలు అడగడానికి వెళ్ళిన మీడియా వాళ్ళకి ఆయన సమాధానం ఇస్తూ ఈ ప్రశ్నలపై ఉన్న తెర తీశాడు. ఆయన మాట్లాడుతూ.. తాను టీడీపీ కార్యకర్తనని, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు ఎలాంటి అభిప్రాయబేధాలూ లేవని అన్నారు. ఢిల్లీ జరిగిన ధర్మపోరాట దీక్షలోనూ సీఎం వెంట వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లేందుకు ఢిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్‌బ్యూరో సమావేశ గురించి సమాచారం అందిందని, అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక హాజరు కాలేకపోయానని వివరించారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. అలాగే, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టీడీపీలోకి రావడం తనకిష్టం లేదని సాగుతోన్న ప్రచారంపై కూడా అశోక్ స్పందించారు. ఇదంతా కేవలం అభూత కల్పనేనని, ఆయన మంచి వ్యక్తి అని, కిశోర్ టీడీపీలోకి రావడం స్వాగతించదగ్గ విషయమేనని అన్నారు. మరోవైపు, అశోక్ కుమార్తె అదితి, విజయనగరంలో గత రెండు మూడేళ్లుగా పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దీంతో, అదితి గజపతిరాజు రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ఇటీవలి మీడియాలో ప్రచారం సాగుతుంది.