జూబ్లీహాల్లో మంగళవారం 15వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ , ఇతర సభ్యులు, మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది మంత్రులు పాల్గొన్నారు.. ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సిఎం కేసిఆర్ ని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు..!
అయితే సమావేశం అనంతరం పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణకోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు అద్భుతమని నీటిపారుదల రంగంలో ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రారంభించిన మెగా ప్రాజెక్టు కాళేశ్వరం అత్యద్భుతమని ఎన్కేసింగ్ అన్నారు. ప్రాజెక్టును తమ సంఘం సభ్యులు ప్రత్యక్షంగా చూసి వచ్చారని.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభ ఉన్నదని పేర్కొన్నారు. రైతుబంధు పథకం వ్యవసాయ ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందని ఎన్కే సింగ్ చెప్పారు. ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శమయిందని.. అనేక రాష్ర్టాలకు మార్గదర్శనంగా మారిందని తెలిపారు.
తమ సంఘం సభ్యులు మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి అన్ని విషయాలను తెలుసుకున్నారని, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, ఇతర పనులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి వాతావరణంలో పారదర్శకమైన రీతిలో చర్చించామన్నారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి తీసుకొంటున్న నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధిలో ఆవిర్భావం నుంచి దూసుకుపోతున్నదన్నారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటులో గణనీయంగా పురోగతి సాధిస్తున్నదని ఆర్థిక సంఘం చైర్మన్ చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీ రేటు దేశ సగటు కంటే 60% అధికంగా ఉన్నదని తెలిపారు. ఏయేటికాయేడు సంపదను గణనీయంగా పెంచుకొంటూ పోతున్న తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని పేర్కొన్నారు.