గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు పూటకో స్టంట్లు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. తనది దిగజారుడు రాకాకీయమని రోజా బాబు పై నిప్పులు చెరిగారు.
వైఎస్ జగన్ బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వస్తున్నారన్న ఆమె వచ్చే ప్రతీ నాయకుడు తమ పదవులకు రాజీనామాలు చేసి వస్తున్నారని అది వైఎస్ జగన్ నైతిక విలువలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ రోజా ధ్వజమెత్తారు.
వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు.