బీజేపీ సీనియర్ నేత, మాజీ కార్వాన్ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
కార్వాన్ నియోజకవర్గం నుంచి బద్ధం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంకు ధీటుగా పార్టీని విస్తరించారు. అప్పట్లో ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఓవైసీకి ఓల్డ్‌సిటీలో బాల్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన ఆయనను అభిమానులు గోల్కొండ టైగర్ అని పిలుచుకునేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను పలుమార్లు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవికి పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న బాల్‌రెడ్డి బంజారాహిల్స్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు.