ముహూర్తం ఖరారు.. ఎన్నికలకు వేళాయే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూన్‌ 3 నాటికి 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌ (జూన్‌ 18), అరుణాచల్‌ప్రదేశ్‌ (జూన్‌1), ఒరిస్సా (జూన్‌ 11), సిక్కిం (మే 27) రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో లోక్‌సభతో పాటే నాలుగు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వివిప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్దంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. మరోవైపు మార్చి 6న కేంద్ర మంత్రివర్గం చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో… ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్ కాస్త ఆలస్యం కావచ్చన్న వాదన ప్రచారంలో ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతికారం తీర్చుకోవాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో.. దానికి తగ్గుట్టుగా . షెడ్యూల్ విడుదల చేస్తారా లేదా అన్నదానిపై ఎన్నికల సంఘం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: