ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు బిమాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన వెనుక ఏ ఉగ్రవాద సంస్థ ఉందనే దాని పై ప్రపంచ వ్యాప్తంగా కలకలం సాగింది. ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయ్ వెళ్లేందుకు.. బీజీ147 విమానం 145మందికిపైగా ప్రయాణికులతో బయల్దేరింది.
కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయాణికుడు తుపాకీతో కాక్‌పిట్‌లోకి చొరబడి.. బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. హైజాకర్ బెదిరింపులతో పైలట్లు చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఫ్లైట్‌ను అత్యవసరంగా దించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే.. భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎయిర్‌పోర్టులో హైజాకర్‌తో అధికారులు చర్చలు జరిపారు. అతడు బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడాలని కోరగా.. ముందు ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేయాలని అధికారులు విజ్ఞప్తి చేయడంతో ఒప్పుకున్నాడు. వెంటనే ప్రయాణికుల్ని అత్యవసర ద్వారం నుంచి బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు.
తర్వాత కమాండోలు హైజాకర్‌ను లొంగిపోవాలని హెచ్చరించినా.. నిరాకరించడంతో కాల్పులు జరిపాల్సి వచ్చింది.ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. హైజాకర్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు. ఈ హైజాక్ వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదంటున్నారు అధికారులు. కేవలం భార్యతో ఉన్న విభేదాలతో దుండగుడు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడని.. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని అధికారులు తేల్చి చెప్పారు. అసలు విమానంలోకి తుపాకీ, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభమైంది.