పేద రైతులకు పక్కాగా నీళ్ళు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎస్టీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరుల ఉపయోగం పై ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్.సీ.లు మురళీధర్.. తదితరులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశం లో భాగంగా ఎస్టీ రైతులకు మంచి పంటలు పండించుకునే విధంగా సాగునీటి ప్రణాళిక వేయాలని ఆదేశించారు. చెరువుల వాగుల గురించి మిషన్ భగీరథ లాంటి విషయాల పై చర్చించారు.

‘‘ రాష్ట్రంలో 46,500 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టులున్నాయి. 16,771 చెరువులు విడిగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90శాతం చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ చెరువులకు ఈ వర్షాకాలం నుంచే ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలి. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, పడువాటు నీళ్లు చెరువులకు చేరే విధంగా ఫీడర్ ఛానళ్లు, అలుగు కాలువలు ఈ ఎండాకాలంలోనే పూర్థిస్థాయిలో సిద్ధం చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కూడా అధికంగానే ఉంది. వాగులు, వంకలు చాలా ఉన్నాయి. వీటిపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాలి. ఎస్టీలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు నీరందుతుందో గుర్తించాలి. మిగతా ప్రాంతాలకు చిన్ననీటి వనరుల ద్వారానే నీరివ్వాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకు చిన్ననీటి వనరుల వినియోగం ద్వారా గరిష్ట భూ వినియోగం అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బూర్గంపాడు సమీపంలో జెన్ కో ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు 1500 హెచ్.పి. మోటార్లను ఉపయోగించి ఆ ప్రాంతానికి నీరివ్వాలని జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావును కోరారు. ఆదిలాబాద్ లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్వరూపం, వాటివల్ల సాగయ్యే భూమి తదితర అంశాలను అధ్యయనం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో వట్టివాగు, లాతూరుగండిలను వినియోగించుకొనే మార్గాలను చూడాలన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్.సీ.లు మురళీధర్, రిటైర్డ్ ఈఎన్సీ విజయ ప్రకాశ్, సీఈ శ్యాం సుందర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇంజనీర్ కృపాకర్, ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, క్రాంతి కిరణ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: