మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారు 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్బాద్లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.
పాక్ భూభాగంలో భారత్ చేసిన సర్జికల్ దాడి తరవాత కేంద్ర నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ను ప్రకటించాయి. టెర్రరిస్ట్ ల టార్గెట్ లో ఉన్న ప్రధాన నగరాలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇవాళ ఉదయం పాక్ పై జరిగిన మెరుపు దాడి తరవాత దేశంలో ఉగ్రమూకలు విరుచుకుపడ వచ్చని నిఘా సంస్థలు రాష్ట్రాలకు సూచించాయి.
ఈమేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు సెంట్రల్ ఐబీ నుంచి వర్తమానం అందింది. సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సూచించింది.