జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని దారుసలాంలో ఎంఐఎం 61 ఆవిర్భావ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ…
ఏపీ, తెలంగాణలో కలపి టీఆర్ఎస్, వైసీపీ 35 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ 19 ఎంపీ సీట్లు సాధిస్తే చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. గతంలో ‘చంద్రబాబూ.. ఐ యామ్ కమింగ్’ అని ప్రకటించిన అసదుద్దీన్ ఇప్పుడు జగన్ అడిగితే ప్రచారం చేస్తా అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ‘చంద్రబాబూ.. ఐ యామ్ కమింగ్’ అంటూ ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్, జగన్, అసదుద్దీన్ అంతా కలసి ఏపీలో టీడీపీని ఓడించేందుకు ఒక్కటయ్యారనే అభిప్రాయం నెలకొంది.