ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ వేసిన 5 గురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 న జరిగే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించబోతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల ఓట్లే గెలుపుకు కీలకం కావటంతో.. ప్రతి ఓటు పైనా ప్రత్యేక దృష్టి పెట్టింది గులాబీ పార్టీ.
త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు సీట్లకు గాను ఆరుమంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎలక్షన్ రసవత్తరంగా మారింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా.. రెండు మూడు ఓట్లే గెలుపుకు కీలకం కాబోతున్నాయి. దీంతో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా సరిగ్గా ఓటు వేసే విదంగా ట్రయినింగ్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఎమ్మెల్యేలను మాక్ పోలింగ్ నిర్వహించి ఓటింగ్ పై వారికి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించే మాక్ పోలింగ్ కు ఎమ్మెల్యేలంతా రావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. 10,11,12 తేదీల్లో ఎమ్మెల్యేలంతా హైదారబాద్ లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. కేటీఆర్ ముఖ్యఅధితిగా హాజరవుతున్న లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సైతం ఈ మూడు రోజులు నిర్వహించటం లేదు. లెక్క ప్రకారం ఉన్న ఎమ్మెల్యేలంతా ఖచ్చితంగా వారి ఓటును సరిగ్గా వినియోగించుకుంటే ఐదుకు ఐదు ఎమ్మెల్సీ సీట్లు సాధించటం సులభం అవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ గెలవాలంటే.. 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ కు చెందిన నలుగురు, మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థి ఒకరు.. మొత్తం ఐదు మంది గెలవాలంటే .. 105 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీఆర్ ఎస్ కు సభలో 90 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎంఐఎం కు చెందిన 7 మంది, టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరు, టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన సండ్ర వెంకట వీరయ్లతో కలిపి మొత్తం 101 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓట్లు వేయనున్నారు. కాంగ్రెస్ కు ప్రస్తుతం సభలో బలం 17 మంది ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావులతో కలిపి 18 మంది సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ్ రెడ్డికి ఓటు వేయనున్నారు. అయితే రెండో ప్రియారిటీ ఓటే కీలకం కానుంది. కాబట్టి ప్రతీ ఓటును గులాబీ బాస్ కేసీఆర్ కీలకంగా భావిస్తున్నారు.
ఇప్పటికే ఏ ఎమ్మెల్యే ఓటును ఏ అభ్యర్థికి కేటాయించాలని అనే విషయంపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను ఐదు టీంలుగా విభజించి .. ఆయా గ్రూపులను సరిగ్గా కేటాయించిన అభ్యర్థికే ఓట్లు వేసే విదంగా ఎమ్మెల్యేలను మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు. రెండో ప్రియారిటీ ఓటుకూడా ఎవరు.. ఎవరికి వేయాలని అనేది ముందే నిర్ణయించి.. ఎమ్మెల్యేలందరికి అవగాహన కల్పించబోతున్నారు. ఐదు కు ఐదు సీట్లు టీఆర్ ఎస్ కే దక్కే అవకాశం ఉన్నా.. మిస్టెక్స్ చేయకుండా బయటపడాలని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు