ముందు అన్న..! ఆపై చంద్రన్న..! 38 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్లు..అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగు దేశం పిలుస్తోంది.. రా.. కదలిరా అంటూ అన్న నందమూరి తారకరామారావు పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్రబిందువుగా నిలిచింది తెలుగుదేశం. కాంగ్రెస్‌ను ఖంగుతినిపించి…అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొంటూ ఎన్నో చరిత్రపుటల్ని తనపేరిట నిక్షిప్తం చేసుకుంది.

పడి లేచే కెరటం….తెలుగుదేశం పార్టీకి సరిపోయేపదమిది. ఒకటి కాదు..రెండు కాదు… 3 దశాబ్థాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చిన ఈ పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది. పార్టీ పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు..ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు.. ఫినిష్ అంటూ మరికొందరి బెదిరింపులు, ఇక ఈ పార్టీ గెలవటం అసాధ్యం.. అంతా మా గాలేనంటూ ప్రత్యర్థి పార్టీలు చేసిన మాటల దాడులనూ తట్టుకున్న పసుపుదళం..దూసుకెళ్లే శరంలా ప్రజామద్దతుకూడగట్టుకుంది. ప్రత్యర్ధులంతా ఏకమై చేసిన మానసిక దాడులన్నింటినీ అధిగమించి ప్రజామద్దతుతో 2014లో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం చేజింక్కించుకునే దిశగా అనేక సంక్షేమ పథకాలకు నాందిపలికింది. రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ..సవాళ్లుసమర్థంగా అధిగమిస్తూ..ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగించిన తెలుగుదేశం 38వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని వినువీధికెగరేసిన తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక చిన్న గదిలో ఆరంభమైంది. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు మానసపుత్రికగా పార్టీ ఆవిర్భవించింది. ఇదే ఓ చారిత్రక అవసరం అన్నట్లుగా..ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా 30 ఏళ్లపాటు తట్టుకొని నిలబడ్డ ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం చరిత్ర సృష్టించింది.
జాతీయస్థాయిలోనూ తనదైన పాత్రను విజయవంతంగా పోషించింది. ఎన్టీఆర్..ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. ప్రాంతీయ పార్టీగా, తిరుగులేని శక్తిగా కేంద్ర, రాష్ట్రాల్లో హవా నడిపిన ఘనతసొంతం చేసుకుంది పసుపుదళం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు విభజనపై ఏదో ఓవైపు మొగ్గు చూపాల్సిన తరుణంలోనూ సమతుల్యత విధానాన్నే పాటించిన తెలుగుదేశం.. విభజన తర్వాత దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీగా అవతరించింది. తెలంగాణలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విభజన హక్కుల సాధన అంటూ కేంద్రాన్ని ఢీకొడుతోంది. పదవులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ కేంద్రంలో ఉన్న 2మంత్రి పదవులకూ రాజీనామా చేసి ప్రజాపోరాటానికి ఉద్యమించింది.

విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం పరిష్కరించేవరకూ వదిలి పెట్టేదిలేదన్న నినాదంతో పోరాటపటిమ కనబరుస్తోంది.
రాష్ట్రప్రయోజనాలకోసం నాలుగేళ్లు ఓపికపట్టామనికేంద్రం తీరుకు నిరసనగాప్రజలపక్షానే ఉండి పోరాడతామంటూ … జాతీయ స్థాయిలోశ్ర భాజపాయేతరపక్షాలన్నింటినీ ఏకం చేసిన ఘనత తెలుగుదేశం అధినేత చంద్రబాబుది. ఓ పక్క రాష్ట్రాభివృద్ధి మరోపక్క విభజనహామీల సాధన, ఇంకోవైపు రాజకీయం ఈ మూడింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ముందుకెళ్తోంది. ఇతర పార్టీలన్నీ తెలుగుదేశాన్ని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నా… ప్రజామద్దతు తమవైపే ఉందన్న ఆత్మస్థైర్యంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే..ప్రజలతోనే మమేకమన్న విధానం తెలుగుదేశం పంథా. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా పార్టీ కోసం పనిచేసి…ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల కోసం ఉచిత విద్య అందిస్తున్న ఏకైక ప్రాంతీయపార్టీ తెలుగుదేశం మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలుకుని ప్రాంతీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించినా.. జాతీయ దృక్పధంతో వ్యవహరించింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..హస్తినలో చక్రం తిప్పగలిగింది.

Share.

Comments are closed.

%d bloggers like this: