తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో భాగంగా నల్గొండలో సభ నిర్వహించారు. ఆయన ప్రసంగం మోదీ తోనే మొదలు పెట్టారు. మోదీ పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ కొంత సేపటి క్రితం మెహబూబ్ నగర్ సభ లో కేసీఆర్ పై చేసిన విమర్శలకి కేసీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా సభలో మోదీ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, ఘోరమైన మాటలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీచేస్తే చచ్చీచెడీ ఒక్కస్థానంలో గెలిచారని, ఇవాళ వాళ్ల మాటలు వింటుంటే కళ్లు తిరిగి కిందపడాలనేట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మోదీ కేంద్ర పథకాలని తెలంగాణ కాపీ కొడుతుందని అక్కడి పథకాలకే పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనదని చెప్పారు. తాము అందిస్తున్న పథకాలనే కాపీ కొడుతూ మోదీ తిరిగి వాటిని తమకే అందిస్తున్నారని ఆరోపించారు. మా ఆరోగ్య శ్రీ గొప్పదో, మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదో తేల్చుకోవాలంటే మా జగదీశ్వర్ రెడ్డిని పంపిస్తా, దమ్ముంటే ఎవరైనా ముందుకు రావాలని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఇదంతా ఎందుకొచ్చిన సోళ్ళు అంటూ మళ్ళీ కేసీఆర్ మోదీ పై విమర్శలు మొదలు పెట్టారు. దేశానికి మోదీ ప్రభుత్వం వచ్చి అయిదేళ్లు అవుతుంది.. ఒక్క మాట ఆడుతున్నా ఆయన ఏం చేశాడు..? రైతులకి ఏం చేశాడు..? వృద్దులకి ఏం చేశాడు..? దళితులకి ఏమైనా చేశాడా..? ముస్లింలకి ఏమైనా చేశాడా..? అనవసరంగా తమకి లేని గొప్పల్ని డబ్బాలో రాళ్ళు వేసినట్టు కొడుతున్నారు అని కేసీఆర్ మోదీ పై విరుచుకపడ్డారు.