Advertisements

కేంద్రం.. ప్రతిపక్షం.. పక్క రాష్ట్రం అందరూ కుమ్మకై..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చులకనగా చేసి మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ఏటీఎం అంటూ హేళన చేయడంపై తీవ్రంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యారాహిత్యంగా విమర్శించారు. రాష్ట్రంలో 65లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు కోట్లాది మందికి తాగునీరందించనున్న పోలవరం ప్రాజెక్టును ఏటీఎం అంటూ వ్యంగంగా మాట్లాడటం అంటే ఇది రాష్ట్రంపై కక్షసాధింపు కాక మరేంటని ప్రశ్నించారు. దేశంలో మరే ప్రాజెక్టు ఇంత వేగంగా నిర్మాణం జరుపుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో చాలా వరకూ పోలవరాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం పోలవం కోసం ఇంతకష్టపడుతుంటే ప్రధాని మాత్రం చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు.

వైఎస్ హాయంలో కేవలం కాలువలు తవ్వడానికే పరిమితమయ్యారని..,. అందులోనూ వందలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని పనులు పరుగెత్తించినట్లు గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 68 శాతం పనులు పూర్తయ్యాయని.. కేంద్రం సహకరించి ఉంటే ఇప్పటికే గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు ప్రజలకు చేరేవని చెప్పైరు. 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయకుంటే ప్రమాణస్వీకారం చేయను అని ముఖ్యమంత్రి పట్టుబడితే ముంపుమండలాలు ఏపీలో కలిశాయన్న సంగతిని కేంద్రానికి గుర్తు చేశారు.

ఐదున్నర కోట్ల మంది జీవనాడి అయిన ప్రాజెక్టుపై మరింత శ్రద్ధచూపాల్సింది పోయి విమర్శించడం ప్రధాన మంత్రికి సరైంది కాదని హితవు పలికారు. పోలవరం బాగా నిర్మిస్తున్నారంటూ కేంద్రమే అవార్డులిచ్చి ఇప్పుడు నిధులివ్వకుండా వేధిస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.4483 కోట్లను ఇంకా చెల్లించలేదన్నారు. కేంద్ర జలవనరుల శాఖ భూ సేకరణకు రూ.33,225 కోట్లు ఇవ్వాలని చెప్తే.. ప్రధాని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే రేట్లు పెంచిందంటూ అబద్ధాలాడుతున్నారని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా ప్రాజెక్టును పూర్తి చేయలేదు కాబట్టే ఈనాడు మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

తెలంగాణ మంత్రులు, ఎంపీలు పోలవరానికి వ్యతిరేకంగా కేసులు వేస్తుంటే ప్రతిపక్ష నేత మాత్రం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కేసీఆర్ కి లొంగిపోయిన జగన్.. వారితో కలిస్తే రాష్ట్రానికి నీళ్లొస్తాయని అసత్యప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నేతలు వేసిన కేసుల వల్ల ఇంజనీర్లకు సగం సమయం ట్రిబ్యునల్ చుట్టూ తిరగడమే సరిపోతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ను ఇంకా ప్రతిపక్ష నేత ఎందుకు సమర్ధిస్తున్నారని దేవినేని ఉమా నిలదీశారు. పులివెందులకు నాలుగువైపులా నీల్లు పారుతుంటే ఒక్క మాట మాట్లాడని జగన్మోహనరెడ్డికి రాష్ట్రంలో అభివృద్ధి కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసుల భయంతోనే పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ తో చేతులు కలిపారన్నారు. జగన్మోహనరెడ్డి, కేసీఆర్, మోదీతో చేతులు కలిపి అమరావతిపై దండయాత్ర చేస్తున్నారని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా చూడటమే మోదీ, కేసీఆర్ జగన్ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ పోలవరంపై వేసిన కేసులకు జగన్ సమాధానం చెప్పాలని లేకపోతే రైతు ద్రోహిగా నిలవడం ఖాయమని దేవినేని ఉమా తెలిపారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: