ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పిలవడం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీకానున్నారు ఏపీ డీజీపీ. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అమరావతి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు డీజీపీ ఠాకూర్. మధ్యాహ్నం ఒంటి గంటకు లేదా సాయంత్రం ఈసీ అధికారులను కలిసే అవకాశం ఉంది. ఈ మధ్య కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ చేసిన ఫిర్యాదులపై కూడా వివరణ కోరే అవకాశం ఉందంటున్నారు.
డీజీపీ అధికార టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఓ సందర్భంలో అమరావతి నుంచి రూ.30 కోట్లను ఒంగోలుకు తరలించడంలో ఆయన ప్రతక్ష్యంగా జోక్యం చేసుకున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డికి సరైన రక్షణ కల్పించలేకపోయారని మరో ఫిర్యాదు చేశారు. మరోవైపు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కూడా ఫిర్యాదు చేసింది వైసీపీ. ఇక పోలీసు అధికారుల బదిలీల్లో అనుసరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై ఆయన వివరణ కోరే అవకాశం ఉందంటున్నారు.