• మా పార్టీ ఎంపీలు సహకరిస్తారు
• ‘హోదా’ ఇవ్వాలని మా ఎంపీలు లోక్ సభలో చెప్పారు
• చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే మా పంచాయితీ
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. వికారాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్ సభలో చెప్పారని అన్నారు. చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే తప్ప ఏపీ ప్రజలతో తమ కెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు తనను తిడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోవడం లేదని, సముద్రం పాలయ్యే నీళ్లు వాడుకుంటే మంచిదే కదా అని అన్నారు. తమకు కులం, మతం, వర్గం లేవని, అందరూ బాగుండాలని కోరుకుంటామని చెప్పారు