గ్లోబరీనాపై బిగిస్తున్న ఉచ్చు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొందరి దురాశ, స్వార్ధం, కాసుల కక్కుర్తితో జరిగే నష్టం అంతా ఇంతాకాదు…కట్టీ కట్టకముందే బ్రిడ్జిలు కూలిపోతాయి. వేలాదిప్రాణాలు పోతాయ…పచ్చని బతుకులు బుగ్దిపాలవుతాయి. ఈ దేశం గర్వపడే సైంటిస్టు, డాక్టర్లు,మేధావులు కావాల్సిన చిన్నారుల నిండు భవిష్యత్‌ బలవుతుంది. ఇపుడు ఇంటర్‌ బోర్డులో ఇదే జరిగింది…కక్కుర్తి అధికారులదా….వెనుక ఇంకెవరి ప్రమేయముందో తెలియదుకానీ….చిన్నారులను బలికొన్న స్వార్ధం పేరు మాత్రం గ్లోబరీనా.

ఇంటర్మీడియెట్‌ బోర్డులో డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు టెండర్‌ కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూలురైన వారికి మేలు జరిగే విధంగా టెండర్‌ విధానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక పని లేదా ప్రాజెక్టు అమలును నేరుగా ప్రైవేటు సంస్థకు అప్పగించకుండా టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేస్తారు. టెండర్లు పిలిచిన సమయంలో ఆశావహ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి తక్కువ ధరలో కోట్‌ చేసే సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తారు.

ఇందుకు సంబంధించి నిపుణుల సమక్షంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. కానీ ఇంటర్‌ బోర్డు డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు అప్పగింత అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూల సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కేవలం అనుకూల సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

2018-19  విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ఇంటర్‌ బోర్డు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకుని ఫలితాల విడుదల వరకూ అన్నిటా సమస్యలే. దాంతో, విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి, విద్యార్థుల వివరాల సేకరణ ఏటా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేస్తోంది. కానీ, ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ సంస్థ గ్లోబరీనా ఆ పని చేయాలి. కానీ, విద్యార్థుల వివరాల సేకరణలో గ్లోబరీనా ఇబ్బందులు ఎదుర్కొంది.

దాంతో, బోర్డు అధికారులు మళ్లీ ఆ పనిని సీజీజీకి అప్పగించారు.ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపులోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వెబ్‌సైట్లో విద్యార్థుల వివరాలు గల్లంతు కావడం, ఫీజు చెల్లించినా చెల్లించనట్లు చూపడం, ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో, పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను మూడుసార్లు పొడిగించారు. దీనినిబట్టే, విద్యార్థులకు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. పలు ప్రభుత్వ కాలేజీలు రెండుసార్లు ఫీజు చెల్లించాల్సి రావడం గమనార్హం.ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్‌కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి, 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నటిక్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండరు కట్టబెట్టారు.

ఈ టెండరు వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా.. నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండరు దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి మరీ గ్లోబరీనాకు టెండరు కట్టబెట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. వీటికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్‌ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటి వరకు ఫలితాల ప్రాసెసింగ్‌ నిర్వహించ లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. కానీ,గ్లోబరీనా ఇప్పటి వరకు గరిష్ఠంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలనే ప్రాసెసింగ్‌ చేసింది.

గ్లోబరీనా సంస్థ సేవలను ఇంటర్‌ బోర్డు మూడేళ్లపాటు వినియోగించుకోనుంది. దీనివెనుక పెద్ద కుట్రే దాగుంది….డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్, ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌కు సంబంధించిన

ప్రాజెక్టు అనుకూల సంస్థకు అప్పగించడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే భారీ ప్రాజెక్టుకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్‌ వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏ అధికారుల కాసుల కక్కుర్తో లేక ఏ రాజకీయ పెద్దల స్పెషల్‌ ఇంట్రస్టో తెలియదు కానీ 18 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయనేది నిజం….భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా రూపుదిద్దుకునే ఇంజనీర్లు, డాక్టరు, మేధావులు నిండు ప్రాణాలు బలితీసుకున్నారు. తమ పోటీ పరీక్షలు పక్కన పెట్టి ఇంటర్‌ బోర్డు దగ్గర ఆందోళన చేసి..పోలీసుల లాఠీ దెబ్బ రుచి చూసి జైళ్లపాలవుతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడం ఎలా….?

Share.

Comments are closed.

%d bloggers like this: